CM Chandrababu Review On BC Welfare And Pensions: స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయించారు. సచివాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై సమీక్షలో చర్చించారు. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు సీఎంకు వివరించగా.. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి చట్టబద్ధత కూడా తెస్తామని.. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లు కోల్పోయారని.. ఇవి తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తు చేశారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సమీక్షలో చర్చించారు.
బీసీ హాస్టళ్లలో వసతుల కల్పనపై..
అలాగే, బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. బాలికల హాస్టళ్లు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 1,100కు పైగా బీసీ విద్యార్థుల హాస్టళ్లు ఉండగా.. ప్రభుత్వ భవనాలు 660, అద్దె భవనాలు 450 ఉన్నాయి. డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా.. రూ.34.14 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఆగస్ట్ నాటికి కాస్మోటిక్ బిల్లులు రూ.20 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. విద్యార్థులకు సామగ్రి, ఇతర వస్తువుల కోసం బడ్జెట్‌లో రూ.18 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే విద్యార్థులకు సామగ్రిని కొనుగోలు చేసి అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని నిర్దేశించారు.
పింఛన్ల తొలగింపుపై..
బీసీ సంక్షేమ శాఖపై సమావేశం నిర్వహించిన అనంతరం సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులున్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోందని చెప్పారు. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టామని.. అర్హులందరికీ పింఛన్లు అందాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనర్హులకు పింఛన్లు ఇవ్వడం సరికాదని, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్ధిష్టమైన నిబంధనలు అమలవ్వాలని పేర్కొన్నారు. అనర్హులను తొలగించేందుకే పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీనే కొందరు తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అటు, ప్రతీ సామాజికవర్గానికీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు పని చేయాలని అధికారులకు సూచించారు.