Srikakulam Latest News: గోగునార వారి జీవితాల్లో కొత్త మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు సాదాసీదాగా సాగిపోతున్న బతుకులకు భరోసా ఇచ్చింది. రోజు రోజుకు చిక్కిపోతున్న కుటుంబాలకు ఆర్థికంగా  చేదోడుగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గోగునారతో తయారు చేసే ఉత్పత్తుల కేంద్రం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. అంతేకాకుండా మరెన్నో అద్భుతాలు సృష్టిస్తోందీ సంస్థ. ఏడాదికి రూ.80 లక్షల వ్యాపారం చేస్తున్నారు. వందలమంది మహిళలకు శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ ఎందరినో వ్యాపారవేత్తలుగా మలుస్తున్నారు. 


బెజ్జిపురం యూత్‌క్లబ్‌లోని  మహిళలకు ఒకప్పుడు వంటిల్లే ప్రపంచం. కానీ ఇప్పుడు గోగునారతో అద్భుతాలు చేస్తున్‌నారు. జాతీయస్థాయిలో మేముసైతం అంటూ నిలబడుతున్నారు. వలసలకు కేరాఫ్ ఆడ్రస్ అయిన సిక్కోలు జిల్లాలో అతివృష్టి, అనావృష్టి వెంటాడుతుంది. వ్యవసాయ చేస్తే పంట చేతికి వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. భవిష్యత్‌ తరాలకూ ఇలాంటి జీవితాలనే ఇవ్వాలా? అని మదనపడ్డారు అక్కడి మహిళలు. అలాంటి వాళ్లకు గోగునార ఓ వరంలా కనిపించింది. వాటితో రకరకాల ఉత్పత్తులు చేసి విక్రయించాలని భావించారు. 



ఆలోచన వచ్చి వారికి యూత్ క్లబ్ అండా నిలిచింది.15 మంది మహిళలతో ఏర్పడ్డ ఈ బృందం ముందుగా గోగునార ఉత్పత్తులు తయారు చేయడం నేర్చుకున్నారు. వాళ్లు నేర్చుకున్న తర్వాతత మరో వందమందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా అందరూ నైపుణ్యత సాధించిన తర్వాత 'గాయత్రి జ్యూట్‌ క్రాఫ్ట్‌' పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. అలా 1993లో మొదలైన వీరి ప్రయాణం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ సాగుతోంది. 


ఉపాధి రంగంలోనే అవార్డులు రివార్డులు సాధిస్తున్నారు. గోగునార ఉత్పత్తుల తయారీలో మాస్టర్‌ ట్రైనీలుగా మారి ఉపాధి పొందడమే కాకుండా ఆసక్తి ఉన్నవారికీ నేర్పించి ఉపాధి బాటపట్టిస్తున్నారు. మొదట్లో సంప్రదాయ శైలి ఊయలలు, చేతిసంచులే చేసిన వీళ్లు ప్రస్తుతం ఆధునిక అవసరాలకు తగ్గట్టు ల్యాప్‌టాప్‌ బ్యాగులు, గృహోపకరణాలు, మ్యాట్‌ వంటి 80 రకాల వినూత్న ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. 


కేవలం బెజ్జిపురం మహిళలే కాదు ఎవరైనా ఇక్కడ శిక్షణ తీసుకునేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.. వారిలో 150 మంది వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారంటున్నారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో 769 మందికి హస్తకళలు, జ్యూట్‌ క్రాఫ్ట్‌, తోలు బొమ్మల తయారీని నేర్పించారు. 2 వేల మందికి గోగునార ఉత్పత్తుల్లో మాస్టర్‌ ట్రైనింగ్ అందించారు. 


బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ మహిళలంతా జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో కూడా పాల్గొంటున్నారు. ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంలోనే కాకుండా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, తమిళనాడులో కూడా గోగునార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీళ్లలో చాలామంది సొంతంగా దుకాణాలు కూడా పెట్టుకున్నారు. ఊరిలో ఎవరికైనా కాస్త తీరిక దొరికితే యూత్‌క్లబ్‌కు వెళ్లి జ్యూట్‌బ్యాగుల తయారీ నేర్చుకుంటున్‌నారు. దీని ద్వారా నెలకు రూ.8 నుంచి 10 వేల వరకు సంపాదిస్తున్నారు. 


ఇక్కడ మహిళలు నాబార్డు, డీఆర్‌డీఏ, కేంద్ర అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆర్థిక సాయంతో ఏడాదికి రూ.80లక్షల టర్నోవర్‌ని సాధిస్తున్నారు. వీరు పొందే లాభాల్లో కొంత క్లబ్‌ వసతులు మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడే పని నేర్చుకున్న ఆర్‌.శర్వాణి ప్రస్తుత ఛైర్‌పర్సన్‌. 



'పిన్నింటి లక్ష్మి భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలని ఈ నార పని చేసే పోషించింది. అందులో ఒక అమ్మాయి సచివాలయ ఉద్యోగి. అప్పల నరసమ్మకి ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ ఇంజినీరింగ్‌ చదివారు. ఒకబ్బాయి స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి. పార్వతి భర్త చనిపోయాక ఈ వృత్తినే నమ్ముకుని ముగ్గురు పిల్లల్ని పోషించిందంటే వారికి ఈ వృత్తిపై ఉండే నమ్మకం నిదర్శనం. ఇలా ఎంతో మంది తమ జీవితాలు మార్చుకున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం అమలవుతున్నప్పట్నుంచీ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని జనపనార సంచులతో పర్యావరణానికి మేలంటున్నారు.


ప్లాస్టిక్‌తో కాలుష్యం పెరిగిపోతున్న వేళ ఈ గోగునార ఉత్పత్తులు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. పెళ్లిళ్లకు గృహప్రవేశాలకు ఇతర ఫంక్షన్లకు బ్యాగులు, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. 24 గంటలు ఇక్కడే పని చేయకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఇక్కడ పని చేస్తూ ఉపాధి, డబ్బులు పొందుతున్నారు. దీంతో కష్టాల్లో కొంతవరకు గట్టు ఎక్కుతున్నాయి