Land values ​​will increase from 1st of Visakha: విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెంచిన విలువలు అమల్లోకి రానున్నాయి. విశాఖలో ఇళ్లు, ఫ్లాట్లు, భూముల అమ్మకం రేటుకు.. రిజిస్ట్రేషన్ వాల్యూకు చాలా తేడా ఉంది. భూమి విలువ గజం యాభై వేలు ఉంటున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్ వాల్యూ పది వేలు కూడా లేదు. అయితే మార్కెట్ రేటుకు తగ్గట్లుగా రిజిస్ట్రేషన్ వాల్యూను ఎప్పుడూ సవరించారు. రిజిస్ట్రేషన్ విలువలు అంతరం పెరిగిపోయినప్పుడు సవరిస్తారు . తాజాగా ఇలా భూముల విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 


విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాలు, వ్యాపార,వాణిజ్య కేంద్రాలుగా ఉన్న అశీల్ మెట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్ పాండురంగాపురం, ఎంవీపీ కాలని, రుషికొండ, షీలా నగర్ వరకు.. రేట్లను భారీగా సవరించారు. రుషికొండలో గజం రిజిస్ట్రేషన్ వాల్యూ పాతిక వేలు ఉంది. ఇప్పుడు ముఫ్పై వేలు చేస్తున్నారు. అశీల్ మెట్ట ప్రాంతంలో భారీగా పెంపు నమోదు అయింది. ఇక్కడ గజం రిజిస్ట్రేషన్ వాల్యూ రూ. 72వేలు ఉండగా.. ఇప్పటి నుంచి ఎవరైనా కొనుగోలు చేస్తే బయట మార్కెట్‌లో  ఎంత రేటుకు కొన్నా .. రిజిస్ట్రేషన్ విలువను రూ. 1 లక్షా ఇరవై వేలుగా నిర్దారించారు. 


నిజానికి అశీల్ మెట్టలో గజం రెండున్నర లక్షలకు కూడా ఇప్పుడు స్థలం దొరకని పరిస్తితి ఉందని చెబుతారు. పూర్తిగా వాణిజ్య ప్రాంతం. ఎంవీపీ కాలనీ ఏరియాలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పీజు 75 వేల రూపాయలు ఉండగా ఇప్పుడు 90వేలకు మార్చారు. స్థలాల విలువలోనే కాక.. అపార్టుమెంట్‌లో అమ్మే స్క్వేర్ ఫీట్ రేట్లను కూడా సవరించారు. ప్రస్తుతం ఎంవీపీ కాలనీలో అపార్టుమెంట్ ఎస్ఎఫ్‌టీ నాలుగున్నర వేల రూపాయలు ఉంది. దీన్ని ఐదు వేల మూడు వందలకు సవరించారు. అత్యధికంగా కిర్లంపూడి లే ఔట్‌లో రూ. ఆరు వేలకు పెంచారు. 


గోపాల పట్నం పరిధిలో ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. అక్కడ తక్కువగానే ధరలు సవరించారు. సింహపురి కాలనీలో అపార్టుమెంట్ స్క్వేర్ ఫీట్ విలువ ప్రస్తుతం రూ.2400 ఉండగా దాన్ని రూ. 2700కు పెంచారు. ప్రహ్లాదపురంలో అతి ఎక్కువగా రూ. 3600గా రిజిస్ట్రేషన్ వాల్యూను ఖరారు చేశారు. గాజువాక పరిధిలోనూ రేట్లు తక్కువగా ఉన్నాయి. పాత గాజువాక పరిధిలో ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ వాల్యూ రెండున్నర వేలు ఉండగా.. దాన్ని మూడు వేలకు పెంచారు. షీలా నగర్‌లోరూ. 2400గా నిర్దారించారు. మధురవాడ పరిధిలో మధురవాడ హవేపై అపార్టుమెంట్ స్క్వేర్ ఫీట్ ధర ఇప్పటి వరకూ నాలుగురున్నర వేల వరకూ ఉండగా దాన్ని రూ. 4700కు మార్చింది ప్రభుత్వం. ద్వారకా నగర్ వరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అత్యధికంగా రూ. 7200.. స్క్వేర్ ఫీట్ కు ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక్కడ స్థలం గజం రూ. లక్షా పన్నెండు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూగా ఉంది. 


భూముల విలువలు పెరగడం వల్ల.. రిజిస్ట్రేషన్ ఖర్చు పెరుగుతుంది. అయితే ఇంటి వాల్యూ కూడా పెరుగుతుందని..  ఆయా ఆస్తులపై ఇచ్చే రుణాలు శాతం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.