Chikkadapally police has issued a notice to Allu Arjun:  అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. సంధ్యా ధియేటర్‌లో తొక్కిసాలట ఘటనపై నమోదైన కేసులో ఆయనను ప్రశ్నించనున్నారు. 


సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల విచారణ              


పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ సంధ్యా ధియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ రోజున తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తొక్కిసలాట కారణంగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కోమాలో ఉన్నాడు. ఈ ఘటనలో అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అదే రోజు బెయిల్ వచ్చింది. అయితే ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇష్యూ రాజకీయంగానూ మారింది.  అల్లు అర్జున్ తరపు లాయర్లతో పాటు అల్లు అర్జున్ కూడా పూర్తిగా పోలీసుల తప్పు వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు.  అందుకే పోలీస్ కమిషనరే ఏకంగా ఆధారాలు బయట పెట్టారు.  


పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్న వైనం                


అల్లు అర్జున్ ఆరోపణల తర్వాత పోలీసులు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు. ప్రెస్మీట్ లో అర్జున్ మాట్లాడటం కూడా తప్పేనని..  బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా కేసు గురించి మాట్లాడకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వివాదాస్పదం అయింది. పోలీసులు వెంటనే నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేకపోతే మరోసారి కోర్టుకు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది. అర్జున్ కేసు విషయంలో ఓ పెద్ద లీగల్ టీం పని చేస్తోంది. ఆ లీగల్ టీం ఇచ్చిన సలహాల మేరకే అర్జున్ మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు.           


లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సంప్రదింపులు                  


కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేకపోతే ఉదయమే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ తనకు కుదరకపోతే ఆయన మరింత సమయం కావాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేసు  రాను రాను సున్నితంగా మారుతున్నందున .. మీడియా ఎదుట కూడా మాట్లాడినందున విచారణకు వెళ్లడమే మంచిదని ఆయన క్యాంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  పోలీసుల ముందు హాజరైనా అర్జున్ కు అరెస్టు ముప్పు లేదు. ప్రశ్నించి పంపించేస్తారు. ఇదే కేసులో నాలుగు వారాల మధ్యంతబెయిల్ హైకోర్టు ఇచ్చింది.   అప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేయరు. అయితే విచారణకు హాజరు కాకుండా ఉంటే.. విచారణకు సహకరించడం లేదని దిగువకోర్టులో పోలీసులు వాదించే అవకాశం ఉంటుంది. అలాంటి చాన్స్ ఇవ్వకుండా పోలీసుల ఎదుట హాజరవుతారని అంటున్నారు.