World Tuberculosis (TB) Day 2024: ట్యూబర్ క్యులోసిస్ (క్ష‌య వ్యాధి).. ప్రాణాంత‌క వ్యాధుల్లో ఇది ఒక‌టి. ఒక‌ప్పుడు ఈ రోగంతో ప్ర‌పంచంలో ఎంతోమంది త‌మ ప్రాణాలు విడిచారు. ఆ త‌ర్వాత కొంత‌మేర అవ‌గాహ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ.. ల‌క్ష‌లాది మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. 2022లో దాదాపు 1.3 మిలియ‌న్ మంది ఈ వ్యాధి బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. మైకో బ్యాక్టీరియ‌మ్ ట్యూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వ‌ల్ల ఈ వ్యాధి సోకుతుంది. క్ష‌య వ్యాధి ఉన్న‌వాళ్లు ద‌గ్గ‌డం, తుమ్మ‌డం, ఉమ్మేయ‌డం ద్వారా ఇది వేరొక‌రికి సోకుతుంది. అయితే, త‌గిన జాగ్రత్త‌లు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించ‌వ‌చ్చని చెప్తున్నారు డాక్ట‌ర్లు. ఈ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఏటా మార్చి 24న ట్యూబర్ క్యులోసిస్ డేని నిర్వ‌హిస్తున్నారు. ఇదే రోజు ఎందుకు దీన్ని నిర్వ‌హిస్తున్నారు. హిస్ట‌రీ ఏంటి? తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి? ఒక‌సారి చూద్దాం. 


హిస్ట‌రీ ఏంటంటే? 


కొన్నేళ్ల క్రితం.. టీబీతో ప్ర‌పంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మ‌ర‌ణించారు. దీంతో అస‌లు ఏంటి ఈ వ్యాధి? ఎందుకు సోకుతుంది అనే దానిపై రిసెర్చ్ చేశారు డాక్ట‌ర్ రాబ‌ర్ట్ కోచ్. ఎన్నో రోజుల రిస‌ర్చ్ తర్వాత మైకో బ్యాక్టీరియ‌మ్ ట్యూబర్ క్యులోసిస్ వ‌ల్ల ఈ వ్యాధి సోకుతుంద‌ని తేల్చారు. 1882 మార్చి 24న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాబ‌ర్ట్ కోచ్.  ఈ మేర‌కు అప్ప‌టి నుంచి టీబీకి సంబంధించి రిసెర్చ్ ముమ్మ‌రంగా మొద‌లైంది. దానికి ట్రీట్మెంట్ క‌నిపెట్టారు. దీంతో కోచ్ ప‌నిత‌నాన్ని గుర్తించిన ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఎగైనెస్ట్ ట్యూబర్ క్యులోసిస్ అండ్ లంగ్ డిసీస్.. మార్చి 24ను టీబీ డేగా జ‌ర‌పాల‌ని 1982లో ప్ర‌పోజ్ చేశారు. ఆ త‌ర్వాత 1983 నుంచి ఈ రోజును టీబీ డేగా నిర్వ‌హిస్తున్నారు. అలా ఏటా.. మార్చి 24న టీబీ డే నిర్వ‌హిస్తున్నారు. ట్యూబర్ క్యులోసిస్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దీన్ని నిర్వ‌హిస్తారు. దాంట్లో భాగంగా ఏటా ఒక స్లోగ‌న్ తో అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటారు. ఈ ఏడాది “Yes! We can end TB” అనే నినాదంతో నిర్వ‌హిస్తున్నారు. 


టీబీకి వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే అప్రమత్తమై డాక్టర్‌ను సంప్రదించాలి.


⦿ మూడు వారాలపాటు ఆగకుండా దగ్గు వస్తుంది.
⦿ రక్తంతో కూడిన కఫం వస్తుంది.
⦿ అకస్మాత్తుగా బరువు కోల్పోతారు.
⦿ తరచుగా జ్వరానికి గురవ్వుతారు.
⦿ ఆకలి వేయదు.
⦿ అలసట, నీరసంగా ఉంటుంది.
⦿ రాత్రిపూట చెమటలు పడుతాయి.


తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటంటే? 


నివారణ కంటే నిరోధన ఉత్తమం. మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉంటే ఏ వ్యాధి ద‌రిచేర‌దు అంటారు. అలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే టీబీ నుంచి కూడా మ‌నల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ, జాగ్ర‌త్త‌లు తీసుకుంటే టీబీ బారిన ప‌డం అంటున్నారు డాక్ట‌ర్లు. మ‌రి ఏంటా టిప్స్.. ఒక‌సారి చూసేద్దాం. 


1. వీక్ ఇమ్యూన్ సిస్ట‌మ్ ఉన్న‌ప్పుడు, టీబీ పేషంట్లు మీ చుట్టూ ఉన్న‌ప్పుడు లేదా టీబీ పేషంట్లు ఎక్కువ‌గా ఉన్న ఏరియాలో మీరు ఉన్నా.. క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 


2. క్లోజ్ గా ఉన్న ప్లేస్ లోనే టీబీ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే, వెంటిలేష‌న్ ఉండేలా చూసుకోవాలి. గాలి బాగా రావ‌డం వ‌ల్ల‌.. బ్యాక్టీరియా డైల్యూట్ అయిపోతుంది. ఒకరి నుంచి ఒక‌రికి వ్యాపించ‌దు. 


3. ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు క‌చ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. 


4. ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు నోరు, ముక్కును టిష్యూ లేదా హ్యాండ్ క‌ర్చీఫ్ తో క‌వ‌ర్ చేసుకోవాలి. దీంతో టీబీ ఒక‌రి నుంచి ఒక‌రికి స్ప్రెడ్ అవ్వ‌దు. 


5. మీకు టీబీ ఉన్నా లేదా టీబీ పెషంట్స్ మీ చుట్టుప‌క్క‌ల ఉన్నా మాస్క్ పెట్టుకోవాలి. 


6. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా వ్యాక్సిన్ తీసుకుంటే బెట‌ర్. Bacillus Calmette-Guérin (BCG) వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. 


7. ఇమ్యూన్ సిస్ట‌మ్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. అప్పుడే టీబీ సోక‌కుండా ఉంటుంది. రోజు వ్యాయామం చేయ‌డం, కంటి నిండా నిద్ర‌పోవ‌డం లాంటి చేయాలి. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకోవ‌డానికి దూరంగా ఉండాలి. 


8. ట్రీట్మెంట్ మొద‌లై.. టీబీ త‌గ్గుముఖం ప‌ట్టేంత వ‌ర‌కు వ్యాధి సోకిన వారికి దూరంగా ఉంటే మంచిది.


9. టీబీ సోకిన త‌ర్వాత క‌చ్చితంగా.. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫుల్ కోర్స్ వాడాలి. అప్పుడే వేరొక‌రికి స్ప్రెడ్ కాదు. రిస్క్ త‌గ్గుతుంది. 


10. టీబీ సోకిన వారికి ద‌గ్గ‌రిగా ఉండేవాళ్లు, హెల్త్ వ‌ర్క‌ర్స్ రెగ్యుల‌ర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. దానివ‌ల్ల ఒక‌రి నుంచి ఒక‌రికి సోక‌కుండా నివారించ‌వ‌చ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: వడదెబ్బ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..