Telangana News: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆరు రోజులుగా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు కీలక అంశాలు రాబట్టారని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉన్నతాధికారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. 


అప్పటి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, అడిషనల్‌ చీఫ్‌ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న పేర్లు ప్రణీత్‌రావు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన సమాచారంతో ఈ నలుగురి ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేశారు. రాత్రి నుంచి ఈ సోదాలు జరిగాయి. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, ఐ ప్యాడ్‌లు, ఇతర డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. 


ప్రస్తుతం ప్రభాకర్‌రావు, రాధాకిషన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పుకుంటున్నారు. వాళ్లిద్దరు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లాలని సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో మాత్రం పెను సంచలనంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. 


మరోవైపు ఆరు రోజులుగా ప్రణీత్‌రావును విచారించిన పంజాగుట్ట పోలీసులు ఇవాళ ఏడో రోజు కూడా ప్రశ్నించనున్నారు. సాయంత్రానికి ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు ఉంచుతారు. అనంతరం మరోసారి కస్టడీకి కోరడమో... రిమాండ్‌కు పంపించడమో జరగనుంది.