Sunstroke precautions: వేసవి వచ్చేసింది. వేడి గాలులు తెచ్చేసింది. ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలు బయటపెడితే... ఎండవేడికి సుర్రు మంటోంది. వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. ఈ  పరిస్ధితుల్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. 


వడదెబ్బ లక్షణాలు
ఎండలో బయటతిరిగే వాడికి వడదెబ్బ తగులుతుంది. తలనొప్పి రావడం... తల తిరగడం వడదెబ్బ లక్షణాలు. అంతేకాదు... తీవ్రమైన జర్వం కూడా వస్తుంది. నిద్ర మత్తు ఎక్కువగా ఉంటుంది. ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.  అపస్మారకస్థితికి కూడా వెళ్లొచ్చని చెప్తున్నారు నిపుణులు.


వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే వడదెబ్బ తగలొచ్చు. కనుక వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రత గురించి సమాచారం తెలుసుకుంటూ... అప్రమత్తంగా ఉండాలి. తలపై నేరుగా ఎండపడకుండా టోపి పెట్టుకుంటే  మంచిది. లేదంటే కర్చీఫ్‌ కట్టుకోవచ్చు. తెలుపురంగు కాటన్ వస్త్రాలు ధరించడం ఉత్తమం. అలాగే.. కళ్లకు కూడా జాగ్రత్తలు పాటించాలి. సన్ గ్లాసెస్ ఉపయోగిస్తే మంచిందని నిపుణులు చెప్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో ఉండేందుకు  ప్రయత్నించాలి. దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగాలి. ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీటిని తాగాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే మంచినీరు గానీ, నిమ్మరసం గానీ, కొబ్బరినీరు గానీ తాగాలి. ఇంటి  వాతావరణాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవాలి. ఫ్యాన్‌ వాడుకోవాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. ఇంట్లో చల్లదనం కోసం పైకప్పులకు వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.  మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు.. భవనాన్ని చల్లగా ఉంచుతాయి. ఇంట్లో ఎండవేడి తగ్గిస్తాయి. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు తలతిరుగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినా.. ఇతర అనారోగ్య సమస్యలు  ఏర్పడినా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడనివి
ఎండ తీవ్రత  ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... గొడుగు కచ్చితంగా వాడాలి. గొడుగు లేకుండా ఎండలో బయట తిరగకూడదు. వేసవి కాలంలో నలుపురంగు, మందంగా ఉండే  దుస్తులు ధరించడం మంచిదికాదు. మధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లి... శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే  మంచిది. ఎందుకంటే... వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంటుంది. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీలు, కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్థాలు తీసుకోకూడదు. ఎక్కువ లైటింగ్‌ వచ్చే  బల్బులు వాడినా ఇంట్లో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్థాలు, శీతలపానీయములు, ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎండ ఎక్కువగా వున్న సమయంలో..  వంట గది తలుపులు, కిటికీలను తెరిచి గాలి వచ్చేలా చూసుకోండి. వడదెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువకూడదు. ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పిస్తేనే మంచిది.