Delhi CM Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆప్ నేతలంతా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ పిటిషన్ విచారణకు అంగీకరించింది. అత్యవసర విచారణకు ఆమోదం తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్‌ఎమ్ సుంద్రేశ్, జస్టిస్ బ్లీ ద్వివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఇక ఈడీ కేజ్రీవాల్‌ని 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టుని అనుమతి కోరనుంది. ఈ అరెస్ట్‌పై I.N.D.I.A కూటమి కూడా భగ్గుమంటోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ కూటమి నేతలూ తమతో పాటు నిరసనల్లో పాల్గొనాలని ఆప్ ఇప్పటికే అందరికీ ఆహ్వానం పంపింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి సీఎం కేజ్రీవాల్ మాత్రమే. ఇంటి నుంచి ఆయనకు కావాల్సిన మందులు, బ్లాంకెట్స్ పంపించారు. అయినా ఆయన ఈడీ కస్టడీలో రాత్రంతా నిద్రపోలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 21న సాయంత్రం ఆయన ఇంట్లో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు రెండు గంటల పాటు లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి విచారణ జరిపారు. ఆయనను అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఈడీ హెడ్‌క్వార్టర్స్‌కి తరలించారు.
ఇవాళ మధ్యాహ్నం (మార్చి 22) అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ కోర్టులో హాజరు పరచనుంది. ఆ సమయంలోనే 10 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని కోరే అవకాశాలున్నాయి. అటు ఆప్ నేత అతిషి ఈ అరెస్ట్‌పై ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్ భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షం అనేదే ఉండకూడదనుకుంటున్నారని మండి పడ్డారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల్ని హౌజ్ అరెస్ట్ చేశారని మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ తల్లిదండ్రులతో మాట్లాడడానికీ వీల్లేకుండా పోయిందని మరి కొందరు నేతలు మండి పడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేజ్రీవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీలోనే కాకుండా తమిళనాడులోనూ కేజ్రీవాల్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.