మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్ర పోవాలి అనిపిస్తుంది. కళ్ళు చాలా భారంగా మారిపోయి.. రెప్పలు మూతలు పడిపోతాయి. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుంది. బలవంతంగా నిద్రని ఆపుకున్నా కూడా ఒక్కోసారి మనకి తెలియకుండానే నిద్రపట్టేసి.. టేబుల్ మీద వాలిపోతుంటారు. ఇంకేముంది, అది కాస్తా బాస్ కంట పడితే అంతే సంగతులు. చాలా మందికి ఇదే జరుగుతుంది. రాత్రి బాగానే నిద్రపోయానే మళ్ళీ నిద్ర ఎందుకు వస్తుందబ్బా అని అనుకుంటూ ఉంటారు. అసలు మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుంది. కళ్ళు ఎందుకు తెరవలేనంత భారంగా మారిపోతాయో మీకు తెలుసా? అందుకు కారణం మనం చేసి చిన్న చిన్న తప్పిదాలు, అలసట, ఉదయం మనం తీసుకునే అల్పాహార ప్రభావం.


క్రమరహిత ఆహారపు అలవాట్లు


ఆకలి అవుతుంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తినడం, సమయానికి తినకపోవడం వంటి అలవాట్లు అలసటకి దారి తీస్తుంది. అందుకే భోజనం సరైన సమాయనికే చెయ్యాలి. సరైన సమయానికి భోజనం చేయడం వల్ల రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. శరీరానికి అవసరమైన శక్తిని సరఫరా కావాలంటే టైమ్‌కు తినాల్సిందే. ఒకవేళ పనిలో పడి మీరు సరైన సమయానికి తినడం మర్చిపోతే ఫోన్లో రిమైండర్ సెట్ చేసుకుంటే.. అదే మీకు గుర్తు చేస్తుంది.


కంప్యూటర్ ఎక్కువగా చూడటం


ఆఫీసులో ఉన్నప్పుడు మనం ఎక్కువ సేపు కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటాం. తదేకంగా దాన్నే చూస్తూ ఉండటం వల్ల కళ్ళు అలిసిపోతాయి. అదే కాదు ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవడం వల్ల కూడా శరీరం అలసటకి గురవుతుంది. మధ్యాహ్న భోజన సమయంలో ఫోన్ చూస్తూ తినేస్తారు కొంతమంది. అలా అసలు చెయ్యకూడదు. ప్రశాంతంగా సరైన సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కళ్ళకి విశ్రాంతి ఇవ్వడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మీ శక్తి స్థాయిలని పెంచుతుంది.


కాఫీ, స్వీట్ బిస్కెట్స్


టిఫిన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి ఆకలిగా అనిపించి స్వీట్ బిస్కెట్స్ తినడం వంటివి చేస్తారు. గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల కొద్దిగా రిలాక్స్ అవుదాం కదా అనుకోని వెళ్ళి కాఫీ తాగేస్తారు. కొంత వరకు అది మంచిదే. కానీ కొందరు అదే పనిగా కాఫీలు తాగుతూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్ కి బదులుగా ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవాలి. అవి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. తాజా లేదా ఎండిన పండ్లను ఎంచుకోవడం ద్వారా తీపి చిరుతిళ్లకు దూరంగా ఉండొచ్చు.


చుట్టుపక్కల వాతావరణం


సహజ కాంతి లేకపోవడం, గజిబిజిగా ఉండే డెస్క్, మిణుకు మిణుకు మనే లైట్లు, సరిపడే వెంటిలేషన్ లేనప్పుడు కూడా మీరు త్వరగా అలిసిపోయిన భావన కలుగుతుంది. వాటి వల్ల కూడా నిద్ర వస్తుంది. తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, పొడి దగ్గు, దురద చర్మం, శ్వాసలోపం కూడా మరి కొన్ని కారణాలు. అందుకే మీరు పని చేసే సమయంలో మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. కనీసం అరగంటకు ఒకసారైన నడుస్తూ ఉండాలి. కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఒత్తిడి వల్ల కూడా అలసటకు గురవుతూ ఉంటారు. వీటన్నిటిని అధిగమించడం వల్ల మీకు మధ్యాహ్నం వేళ నిద్ర నుంచి బయట పడొచ్చు. బాస్ చేతిలో తిట్లు తప్పించుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: బిగ్గరగా గురక పెడుతున్నారా? మీరు ఈ ప్రమాదం బారిన పడుతున్నట్టే


Also read: గర్భిణిలు కాకరకాయ తింటే చాలా సమస్యలు దరిచేరవు, మీ బిడ్డకోసమైనా తినండి