Loud Snore: గురక పెట్టె వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ పక్కనున్న వారికి అది పెద్ద సమస్య. పైగా వాళ్ళు అంత పెద్దగా గురక పెడుతూ నిద్రపోతున్నారనే విషయమే తెలియదు. కానీ పక్కన ఉన్న వాళ్ళకే నరకంగా ఉంటుంది. వాళ్లు పెట్టె గురక శబ్దానికి నిద్ర పట్టక అల్లడిపోతారు పాపం. గురక అంటే శబ్దంతో కూడిన శ్వాస. నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు శబ్ధం వస్తుంది. కొంత మందికి చిన్నగా గురక వస్తే మరి కొంతమందికి మాత్రం చాలా బిగ్గరగా గురక పెడతారు. అలసట, అలర్జీలు, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి గురక రావచ్చు. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే రోజూ గురక పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. బిగ్గరగా గురక పెట్టడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కొత్తగా ఓ అధ్యయనం చెప్తోంది.


క్యాన్సర్ వచ్చే ప్రమాదం 
గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. అంతే కాదు గురక వల్ల ఊపిరిపీల్చుకోవడంలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వెంటనే దానికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురక వల్ల శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ కొరత వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నట్టు స్వీడన్ కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. గురక వల్ల ఎవరైనా నిద్రలో ఉన్నప్పుడు కొద్దిసేపు శ్వాస ఆగిపోయే పరిస్థితి కూడా తలెత్తే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.


ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడానికి కారణమవుతుంది. అలాగే ముఖ్యమైన శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. గురక వల్ల ఊబకాయం ఉన్నవారు, ధూమపానం చేసేవారు, అతిగా మద్యపానం చేసేవారు ఎక్కువగా బాధపడతారు. పరిశోధనల నివేదిక ప్రకారం బిగ్గరగా గురక పెట్టడం వల్ల క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతిరులో కూడా మార్పులు గమనించినట్టు సదరు నివేదిక పేర్కొంది.


జ్ఞాపకశక్తి మందగింపు 
నిద్రలో అక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరులో మార్పులే కాకుండా జ్ఞాపకశక్తితో కూడా సంబంధం ముడి పడి ఉన్నట్టు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన సదరు పరిశోధకులు వెల్లడించారు. 70 ఏళ్ల పైబడిన వ్యక్తుల్లో బిగ్గరగా గురక పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి మందగించినట్టు కనిపెట్టమని చెప్పారు.


గురక వల్ల వచ్చే సమస్యలు 
దీర్ఘకాలిక గురక వల్ల స్లీప్ అప్నియా వస్తుంది. నిద్ర లేమి వల్ల పగటి పూట నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. స్లీప్ అప్నియా మీ గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, మీరు గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం