మొక్కజొన్నలు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వాటిని ఎప్పుడూ ఉడకబెట్టుకునో, కాల్చుకునో తినేస్తుంటారు చాలా మంది. వాటితో గారెలు చేసుకుని తింటే రుచి మామూలుగా ఉండదు. చూస్తేనే మీకు నోరూరిపోవడం ఖాయం. రెండు మొక్కజొన్నలు కొనుక్కుంటే చాలు ముగ్గురికి సరిపడా గారెలు చేసుకోవచ్చు. అందునా మొక్కజొన్నలు మంచి రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని తీపి గారెలుగా,కారం గారెలుగా... రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము కాస్త స్పైసీగా ఉండే గారెలు చెప్పాము. వర్షం పడుతున్నప్పుడు వీటిని వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. అన్నట్టు వీటిని సాయంత్రం స్నాక్స్ గానే కాదు, ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కూడా తినవచ్చు. 


కావాల్సిన పదార్ధాలు
పచ్చి మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - అయిదారు
వెల్లుల్లి రెబ్బలు - అయిదారు
ధనియాలు - ఒక టీ స్పూన్
కరివేపాకు - మూడు రెమ్మలు 
ఉల్లిపాయ - ఒకటి 
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - అర టీ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా


తయారీ ఇలా
1. ఒక గిన్నెలో మొక్క జొన్న గింజలు, పచ్చిమిర్చి, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కాస్త చక్కెర వేసి, ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. 
2. అవన్నీ మిక్సీజార్లో వేసి రుబ్బుకోవాలి. మరీ పేస్టులా కాకుండా 80 శాతం మాత్రమే రుబ్బుకోవాలి. అంటే కాస్త కచ్చపచ్చాగా అన్నమాట. 
3. ఒక గిన్నెలోకి ఈ రుబ్బును తీసి పెట్టుకోవాలి. అందులో కరివేపాకులు, కొత్తిమీరు తురుము వేసి కలపాలి. గిన్నెపై మూత పెట్టి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక రుబ్బును గారెల్లా ఒత్తుకుని వేయించాలి. 
5. గోల్డెన్ రంగులోకి మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 
6. వీటి రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యకరమైన చిరుతిండి ఇది. 


మొక్కజొన్నలతో లాభాలు..
మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తహీనత ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త సరఫరా సవ్యంగా సాగేలా చేస్తుంది. గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జుట్టు బలంగా పెరగాలన్నా మొక్కజొన్నలు తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు సహకరిస్తుంది. మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి, పుష్కలంగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. మొక్కజొన్నలు తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. 


Also read: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?