చపాతీ పిండి ఇప్పుడంటే ప్యాకెట్లలో కొనేసుకుంటున్నాం. గ్రామాల్లో అయితే గోధుమలు మిల్లుకిచ్చి ఆడించుకుంటారు. ఇప్పుడు అత్యాధునిక మిషనరీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి పిండి ఆడే పద్ధతులు కూడా మారిపోయాయి. కానీ ప్రాచీన కాలంలో పిండి మరలు ఎలా ఉండేవో తెలుసా? ఫోటోలో చూస్తున్నారుగా అలాగే ఉండేవి. ఇన్ స్టా వీడియోపై క్లిక్ చేస్తే ఆ మర యంత్రాన్ని కూడా చూడవచ్చు. ఇది ఇప్పటిదీ కాదు, ఆరువందల ఏళ్ల నాటిది. అప్పట్నించి ఆగకుండా పనిచేస్తూనే ఉంది. ఈ పిండి మిల్లు గురించి ఓ బ్లాగర్ పోస్టు చేసేసరికి వైరల్ గా మారింది. అన్నట్టు ఈ మరయంత్రం నీటి నుంచి పుట్టే శక్తితో నడుస్తుంది. 


ఎక్కడుంది?
ఈ పురాతన పిండి మిల్లు పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని ఫతేగర్ ప్రాంతంలో ఉంది. దీన్ని అక్కడ ‘క్రాట్’, ‘చక్కి’ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి కాలంలో దీన్ని బాగా ఉపయోగించారు. మిల్లు పాత పద్దతిలో నడవడమే దీని ప్రత్యేకత. విద్యుత్ అవసరం లేకుండా ఇప్పటికీ యంత్రం పనిచేయడం నిజంగా గొప్పే. అందుకే ఈ వీడియో ఇన్ స్టాలో పోస్టు చేస్తే దాదాపు 10 లక్షల మందికి పైగా చూశారు. 5.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 


ఆ వీడియోలో జుగ్ రాజ్ అనే వ్యక్తి ఈ మిల్లు గురించి వివరించారు. ఏ చెరువు నుంచి వచ్చే నీటితో మిల్లు నడుస్తుందో కూడా చూపించాడు. బలమైన నీటిప్రవాహం వల్లే మర యంత్రం పనిచేస్తుందని చెప్పారు. ఆధునిక యంత్రాల్లో పిండి ఆడితే ఆ పిండిని ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. కానీ ఈ యంత్రం నుంచి వచ్చే పిండి మాత్రం చల్లగా ఉంటుంది. ఎక్కువగా ఈ పిండిమరలో గోధుమలే ఆడతారు. బయట దొరికే చపాతీలో గ్లూటెన్ అధికంగఆ ఉండి, జీర్ణించుకోవడం కష్టంగా మారుతుంది. ఈ యంత్రం ద్వారా చేసే పిండిని తింటే చాలా పోషకాలు అందుతాయి. అంతేకాదు ఈ పిండితో చేసే చపాతీలు మెత్తగా వస్తాయి. రుచి కూడా బావుంటుందని చెబుతారు చుట్టుపక్కల వారు. 



Also read: మహమ్మారి ఇంకా పోలేదు,ప్రపంచంలో పద్నాలుగు కోట్ల మందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు


Also read: పదహారు పిల్లల తల్లి, ఆమె జీవితంలో 14 ఏళ్లు గర్భవతే