ఆదిత్య స్కూల్ దగ్గరకి వచ్చి దేవిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. దేవి ఇంటికి వస్తుందని సత్యకి ఫోన్ చేసి చెప్తాడు. తన కోసం ఏమైనా స్నాక్స్ చేసి పెట్టు అని సంబరంగా చెప్తాడు. బయట నుంచి తెప్పించకు ఇంట్లోనే చేసి పెట్టమని అంటాడు. ఆదిత్య ఎప్పుడు ఇంత ఆనందంగా మాట్లాడలేదు, దేవి అనేసరికి అన్ని మర్చిపోతాడు, చిన్న పిల్లడిలా మారిపోతాడు, ఇంత అభిమానం ఎందుకు? దేవి గురించి ఆలోచించినంతగా కమలక్క బిడ్డ గురించి ఆలోచించలేదు ఎందుకు ఇలా అని సత్య అనుమానపడుతుంది. దేవి కారు నేర్చుకుంటాను అని చెప్పేసరికి ఆదిత్య తనకి బేసిక్స్ చెప్తూ ఉంటాడు.


రాధ చిన్మయిని ఇంటికి తీసుకుని వస్తుంది. చూడు రాధ నాలుగు రోజుల నుంచి వీడియో గేమ్ ఆడుతూ ఉంటే ఈరోజు గెలిచాను, గెలిచెంత వరకు వదిలిపెట్టలేదు అని అంటాడు. దేవి ఏది అని చిన్మయిని అడుగుతాడు. మీ నాయనకి నేను చెప్తాను అని రాధ చిన్మయిని పంపించేస్తుంది. నీ ఆలోచనలకు నీతి లేకపోతే ఎలా గెలుస్తావ్ చెప్పు అని రాధ అడుగుతుంది. దేవమ్మ నా ఇంటికి పోయింది, వాళ్ళ నాయన వేలు పట్టుకుని అయినోళ్లకాడికి పోయింది, ఇలా వెళ్ళి ఏదో ఒకరోజు అక్కడే ఉండిపోతుంది అది ఎంతో దూరంలో లేదని రాధ అంటుంది. మాధవ్ నవ్వుతూ నేను ఇదే మాట చెప్దామని అనుకున్నా, దేవిని పర్మినెంట్ గా ఆ ఇంటికి పంపించేద్దామని అనుకుంటున్నా.. ఎందుకంటే దేవి అక్కడే ఉంటే ఇక్కడ మన ఇద్దరికీ అడ్డు ఉండదు కదా అని అంటాడు.


Also Read: యష్ కి ఐ లవ్యూ చెప్పిన వేద- మొదటిసారి ఆదిత్యకి రాఖీ కట్టినందుకు సంబరంలో ఖుషి


సారు.. అని రాధ కోపంగా అరుస్తుంది. నేను అన్నదాంట్లో తప్పేముంది చెప్పు, ఆవేశపడటం వల్ల ఏం లాభం ఉండదు ఆలోచించు నా ఆలోచన బాగుందని నీకే అనిపిస్తుందని మాధవ్ నీచంగా మాట్లాడతాడు. ఎవరో అరిచినట్టు అనిపించింది నువ్వే అరిచావా అని జానకి కంగారుగా వస్తుంది. ఏంటి అలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఏమి లేదని అనేసరికి మా మాధవ్ నిన్నెమన్నా అన్నాడా అని జానకి అడుగుతుంది. కోపంగా లేదని అంటుంది. దేవి రాలేదేంటి అని అడుగుతుంది ఎక్కడికో పోయింది అన్ని చెప్పాలా అనేసి రాధ కోపంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది.


దేవి కోసం ఇంట్లో దేవుడమ్మ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. దేవి రావడంతో దేవుడమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. నా చెల్లిని చూడటానికి వచ్చా అవ్వని చూడటానికి కాదు అని దేవి అనేసరికి దేవుడమ్మ మీద అలుగుతుంది. నువ్వు మాట్లాడితే నా మనవరాలు మాట్లాడినట్టే ఉంటుందని దేవుడమ్మ అంటుంది. దేవి నా బిడ్డమ్మా ఆ విషయం తెలిస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. రాధ మాధవ్ అన్న మాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతూ బాధపడుతుంది. అది జానకి గమనించి తన దగ్గరకి వచ్చి మళ్ళీ అడుగుతుంది.


Also Read: రాధని ఇబ్బంది పెడుతుంది నువ్వేనా అని మాధవ్ ని అడిగేసిన జానకి- దేవికి మాధవ్ ని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న రుక్మిణి


పదేళ్లుగా నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావ్ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు కాదు, నువ్వు దేని గురించి బాధపడుతున్నావ్ అని అడుగుతుంది. ‘నీ కష్టం ఏంటి అనే అడిగే హక్కు కూడా లేదా, అభిమానంతో కూడా అడగకూడడా, ఈ ఇంట్లో ఆడపిల్ల బాధపడితే ఇంటికే మంచిది కాదు, కష్టం ఎంటో తెలిస్తే మేము చెయ్యగలిగేది చేస్తాం కదా. ఈ మధ్య నీ మొహంలో ఎప్పుడు చూసినా బాధే, ఎవ్వరితో చెప్పుకోలేక బాధపడుతున్నావ్, అడిగి నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదు కానీ ఆడగకుండా ఉండలేకపోతున్నా. నిన్ను మేము మా ఇంటి దేవత అని చూస్తున్నాం ఎందుకంటే ఆరిపోవాల్సిన ఈ ఇంటి దీపాన్ని వెలిగించావ్, ఆ రోజు పసి ప్రాణాన్ని కాపాడావ్. ఇప్పటి వరకు చిన్మయిని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నావ్. తనని కనక పోయిన కన్నతల్లి కంటే ఎక్కువయ్యావ్. అలాంటి నిన్ను బాధపెట్టడం మాకు ఇష్టం లేదు, నువ్వు బాధపడతుంటే చూస్తూ ఉండలేము’ జానకి అంటుంది.


ఎట్లా చెప్పాలి మీరు ప్రాణం లెక్క చూసుకుంటుంటే మీ బిడ్డేమో ప్రాణం తీస్తున్నాడు ఆ విషయం మీకు నేనెలా చెప్పేది అని రాధ మనసులోనే కుమిలిపోతుంది. ‘అందరి దృష్టిలో నువ్వు ఈ ఇంటికి కోడలివి అయినా నేను నా బిడ్డలా చూసుకుంటాను, నువ్వు ఉంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది, నా బిడ్డ సంతోషంగా ఉంటాడు, నా మనవరాలి భవిష్యత్ బాగుండాలని నిన్ను కోడలిగా చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నువ్వు కాదని అన్నావ్ మేము వదిలేశాము మళ్ళీ దాని గురించి నిన్ను అడిగింది లేదు మరి ఎందుకు అలా ఉంటున్నావ్’ అని జానకి అడుగుతుంది.