ప్రసవం క్లిష్టమైన ప్రక్రియ. అందుకే తల్లి పునర్జన్మ ఎత్తిందని అంటారు ప్రసవం అయ్యాక. కానీ ఈ తల్లి పిల్లల కోసం ఎన్నిసార్లు అయినా పునర్జన్మ ఎత్తేందుకు సిద్ధపడింది. ఒకసారి నార్మల్ డెలివరీ అయితేనే ఆ నొప్పులు భరించలేక చాలా మంది రెండోసారి డెలివరీ అంటే భయపడతారు. కానీ ఈ తల్లి మాత్రం పదహారు పిల్లల్ని కన్నది. త్వరలో పదిహేడో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. తన భర్తకు ఇష్టమైతే ఇంకా తాను పిల్లల్ని కనేందుకు సిద్ధమేనని అంటోంది. ఈ జంట అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తోంది. ఈమె తన జీవితంలో పద్నాలుగేళ్లు గర్భవతిగానే ఉంది. 


ఆ జంట పేరు కార్లోస్, ప్యాటీ హెర్నాండేజ్. కార్లోస్ కు పిల్లలంటే చాలా ఇష్టం. తనకు ఇరవై మంది పిల్లలు ఉండాలని అతని కళ. ఇళ్లంతా పిల్లల పరుగులతో నిండిపోవాలని, కళకళలాడిపోవాలని కోరుకుంటాడు. అతనికి తగ్గట్టే భార్య కూడా లభించింది. ఆమెకు తన కోరిక చెప్పాడు. అందుకు ఆమె కూడా సరేనంది. అలా వరుస పెట్టి పిల్లల్ని కంటూనే ఉన్నారు. అలా ఇప్పటివరకు 16 మందిని కన్నారు. వారిలో పెద్ద పిల్లాడికి 14 ఏళ్లు కాగా, చిన్నపిల్లకి ఏడాది. ఇప్పుడు ప్యాటీ మళ్లీ గర్భవతి. తన పిల్లలందరికీ దాదాపు సి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెట్టాడు కార్లోస్. ఎందుకంటే అతని తండ్రి పేరు సి అక్షరంతోనే మొదలవుతుంది. అతని గౌరవార్ధం ఇలా పేర్లు పెట్టాడు. 

ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఉన్నారు. వీరికి మూడు సార్లు కవలలు పుట్టారు. ఇక వారి పేర్లు కార్లోస్ జూనియర్ (14), క్రిస్టోఫర్ (13), కార్లా (11), కైట్లిన్ (11), క్రిస్టియన్ (10), సెలెస్టే (10), క్రిస్తినా (9), కాల్విన్ (7), కేథరిన్ (7), కరోలిన్ (5), కాలేబ్ (5), కెమిల్లా (4), కరోల్ (4), షార్లెట్ (3), క్రిస్టల్ (2), క్లేటన్ (1). 


వచ్చే ఏడాది 17వ పాప
ప్రస్తుతం ప్యాటీ గర్భవతి అని చెప్పాం కదా, వచ్చే ఏడాది మార్చిలో ఆమెకు పాప పుట్టనుంది. అమెరికాలో పుట్టబోయేది ఎవరో ముందు తెలుసుకోవడం చట్టబద్దమే. ప్యాటీ మాట్లాడుతు తాను ఇంతమంది పిల్లలకు తల్లి అయినందుకు సంతోషంగా ఉన్నానని, అది తనకు దక్కిన వరమని తెలిపింది. జీవితంలో 14 ఏళ్లు గర్భవతిగానే జీవించానని, ఆ రోజులు ఎంతో మరువలేనివని చెప్పింది. గత ఏడాది మే నెలలోనే ఈమె చిన్న బిడ్డ క్లేటన్ కు జన్మనిచ్చింది. తమకు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఉండాలని ఆశ అని తెలిపింది. అందుకే మరో ముగ్గురు అబ్బాయిలు పుట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. దేవుడు ఆశీర్వదిస్తే తాము 18వ సారి పిల్లల్ని కనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పింది. 


ఆసుపత్రిలో తనను ఎంతో స్పెషల్ గా చూస్తారని అంటోంది ప్యాటీ. ఎందుకంటే గత పద్నాలుగేళ్లుగా ప్రతి ఏడాది అదే ఆసుపత్రికి తాను ప్రసవానికి వెళుతున్నానని వివరించింది. అక్కడున్న నర్సులు, వైద్యులు తనను ప్రత్యేకంగా చూస్తారని చెప్పింది. ఆసుపత్రి నుంచి వచ్చేస్తూ ‘వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం’ అని చెప్పి వస్తానని తెలిపింది ప్యాటీ. ఈ జంట ఇంతవరకు ఎప్పుడూ గర్భనిరోధక పద్ధతులను పాటించలేదట. అవి పాటించడం ఇష్టం లేదని చెబుతున్నారు. 


Also read: పెళ్లి అయినట్టు కల వస్తోందా? దానర్థం ఇదే


Also read: క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే