ర్భం ధరించాక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోతుంది. ఎందుకో కానీ ఆ సమయంలో స్వీట్లు, బిర్యానీలు, నాన్ వెజ్ వంటలు అధికంగా తినేందుకు ప్రాధాన్యత ఇస్తారు. మామూలు కూరగాయలతో వండే వంటలపై పెద్దగా శ్రద్ధ చూపించరు. స్వీట్లు తినడం వల్ల బిడ్డకు కలిగే లాభాలేమీ లేవు. కానీ కూరగాయలతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో కాకరకాయని పూర్తిగా పక్కన పెడతారు. చేదు అన్న కారణంగా దాన్ని తినరు. అంతేకాదు దానితో చేసే వంటలేవీ అంతటేస్టీగా ఉండవు. అందుకే కాకరకాయతో చేసిన వంటలు తినే గర్బిణులు చాలా తక్కువ. కానీ రుచి కోసమే చూసుకుంటే మీరు చాలా నష్టపోయినట్టే. గర్భం ధరించాక కాకరకాయని తినడం అత్యవసరం. ఇది తల్లికి బిడ్డకు చాలా మేలు చేస్తుంది. కనీసం రెండు రోజులకోసారైనా తినేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మీ గర్భధారణ ప్రయాణం కూడా సులభతరం అవుతుంది. పండంటి బిడ్డ పుడుతుంది. 


కాకర ఎందుకు తినాలి?
కాకరకాయంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీకు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ తినడం నష్టమే కానీ లాభం లేదు.గర్భం ధరించాక మలబద్ధకం సమస్య చాలా మందిలో కలుగుతుంది. హేమరాయిడ్స్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కాకరలో ఉండే ఫైబర్ వీటికి కూడా చక్కటి పరిష్కారమవుతుంది. మలబద్దకాన్ని రాకుండా అడ్డుకుని సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది.  కాకరకాయలో చరంటిన్ , పాలీపెప్టైడ్-పి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ వచ్చినా కూడా పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం. దీని వల్ల పుట్టే  బిడ్డకు చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఈ కూరగాయలో విటమిన్ సి ఉంటుంది.ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టిరియాతో పోరాడే శక్తిని ఇస్తుంది. రోగినిరోధక శక్తిని పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం కాకరకాయ పెరిస్టాల్సిస్‌ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది గర్భిణీ స్త్రీల ప్రేగు కదలిక , జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే తిన్నది చక్కగా అరుగుతుందన్నమాట. అజీర్తి లక్షణాలు రావు. గర్భిణులకు ఫొలేట్ చాలా అవసరం. ఈ పోషకం బిడ్డలో న్యూరల్ ట్యూబ్ లోపాలు రాకుండా నివారిస్తుంది. కాకరకాయ తినడం వల్ల గర్భిణిలకు పుష్కలంగా ఫొలేట్ అందుతుంది. 


ఏం చేసుకుని తినాలి?
కాకర కాయ అనగానే ముఖం ముడుచుకోకండి. దీనితో కొన్ని రకాల వంటలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా బెల్లంగా వేసి కాకరకాయ పులుసు పెట్టుకుంటే వదలకుండా తినేస్తారు. అలాగే  కాకరకాయ పల్లీకారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేపుడు కూర. పప్పు లేదా సాంబారుతో పాటూ దీన్ని చేసుకుని, నంజుకుని తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఈ రెండూ ప్రయత్నించండి. మీ బిడ్డ కోసమైనా తినండి. 


Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం


Also read: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.