తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందొచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటు.. బండి సంజయ్ పాదయాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్రకు జనాల నుంచి మద్దతు బాగానే లభిస్తోంది. ఏ చిన్న ఎన్నికలు జరిగినా బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో వాలిపోతుంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ పర్యటిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా బలాన్ని పెంచుకునేందుకు పార్టీ అగ్ర నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు సినీ నటులతో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించాలని భావిస్తున్నారు.
సెలబ్రిటీలతో బీజేపీ అగ్రనాయకుల భేటీ
గత కొంత కాలంగా హైదరాబాద్ కు వస్తున్న బీజేపీ నాయకులు ఇక్కడి సెలబ్రిటీలను కలుస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో పాటు నటుడు నితిన్ తో సమావేశం అయ్యారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండే నితిన్ జేపీ నడ్డాను ఎందుకు కలిశాడు? అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు నడ్డా నితిన్‌ను కలిశారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావించారు. రెండు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న నితిన్.. పవన్ కల్యాణ్ కు చాలా సన్నిహితుడు. అయినా జనసేన గురించి ఏనాడు ఆయన మాట్లాడలేదు. నితిన్ ఇప్పటి వరకు రాజకీయాల గురించి ప్రస్తావించిన సందర్భం కూడా లేదు. అలాంటి వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగింది.
నిఖిల్ కు బదులుగా నితిన్ సమావేశం
తాజాగా నితిని భేటీకి సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తవానికి జేపీ నడ్డా నితిన్ ను కలవాలి అనుకోలేదట. కార్తికేయ-2 హీరో నిఖిల్ ను కలవాలి అనుకున్నారట. తాజాగా విడుదలైన కార్తికేయ-2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కృష్ణతత్వం గురించి చక్కగా సినిమాలో చూపించడంతో నార్త్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అందుకే హీరో నిఖిల్ ని నడ్డా ప్రత్యేకంగా అభినందించాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్‌ను కలవాలని రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారట. అయితే, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం నిఖిల్ బదులు నితిన్‌ను పిలిచారని తెలుస్తోంది. తీరా జేపీ నడ్డాతో నితిన్ భేటీ అయినప్పుడు.. అతడు కార్తికేయ-2 హీరో కాదని తెలిసిందట. దీంతో చేసేదేమీ లేక కాసేపు నితిన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తంగా బీజేపీ తెలంగాణ నాయకత్వం చేసిన పొరపాటు మూలంగా నిఖిల్ కు బదులుగా నితిన్ జేపీ నడ్డాను కలిశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : కొరియన్‌లో 'ఆర్ఆర్ఆర్' రీమేక్ - ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసిన సునీత తాటి