Bharat Jodo Yatra: 


పెరంబుదూర్ నుంచి..


కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు అంతా సిద్ధం చేసుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కన్యాకుమారిలో ఈ పాదయాత్రను ప్రారంభించ నుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ...ఈ యాత్రకు నేతృత్వం వహించనున్నారు. స్వాతంత్య్ర వచ్చిన తరవాత కాంగ్రెస్ నిర్వహించనున్న అతి పెద్ద పాదయాత్ర ఇదే. దేశ రాజకీయాల్లో ఇది ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎంతో ధీమాగా ఉంది ఆ పార్టీ. ఈ ఏడాది వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ అన్ని ఎలక్షన్స్‌నూ టార్గెట్ చేస్తూ...ఇప్పటి నుంచే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తోంది. ఇండియాను యునైట్ చేయటమే తమ లక్ష్యమని గట్టిగా చెబుతోంది అధిష్ఠానం. చెన్నైలోని శ్రీపెరుంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద రాహుల్ గాంధీ నివాళి అర్పించి...ఈ యాత్రను ప్రారంభించనున్నారు.


"రాజకీయాల్లోను కుట్ర కారణంగా నా నాన్నను కోల్పోయాను. ఈ సారి దేశాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేను. ప్రేమే ద్వేషాన్ని జయిస్తుంది. భయాన్ని నమ్మకం ఓడిస్తుంది. ఒక్కటిగా పోరాడదాం" అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 






మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. అక్కడి నుంచి రాహుల్ కన్యాకుమారి వెళ్తారు. తిరవళ్లూరు మెమోరియల్, వివేకానంద మెమోరియల్, కామరాజ్ మెమోరియల్‌ వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తరవాత మహాత్మాగాంధీ మండపం వద్ద మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ (MK Stalin) రాహుల్ గాంధీకీ ఖాదీతో తయారు చేసిన జాతీయ జెండాను అందించనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు పాదయాత్ర మొదలు పెడతారు. 


హోటళ్లలో బస చేయరు..


ఈ ఎనిమిదేళ్ల భాజపా పాలనలో...దేశం అన్ని రంగాల్లోనూ వెనకబడిందని, ఈ పాదయాత్ర కేవలం కాంగ్రెస్‌ది మాత్రమే కాదని, భాజపాను వ్యతిరేకించే అందరిదీ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రాహుల్ గాంధీ ఈ యాత్రకు నేతృత్వం వహిస్తూ..కశ్మీర్‌ వరకూయాత్ర కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కశ్మీర్‌కు చేరుకునే లోగా...ప్రజలు భాజపా పాలనలో ఎంత నలిగిపోయారో అర్థమవుతుందని అన్నారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయ్‌చూర్, వికారాబాద్, నాందేడ్, జలగావ్, ఇండోర్, కోటా, దౌసా, అల్వార్, బులంద్‌షర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము, శ్రీనగర్...ఇలా సాగుతుంది యాత్ర. మొత్తం 118 మంది శాశ్వత సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారు. మొత్తం 12 రాష్ట్రాల్లో 150 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఎక్కడా హోటళ్లలో బస చేయరు. ఈ సభ్యులు బస చేసేందుకు దేశవ్యాప్తంగా..ఈ యాత్ర రూట్‌లో 60 కంటెయినర్లు ఏర్పాటు చేశారు. వాటిలోనే రాహుల్ సహా అందరూ విశ్రాంతి తీసుకుంటారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..ఈ పాదయాత్రలు, ర్యాలీలు సహా పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు. ఈ ఏడాది జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కోల్పోయిన తన ప్రాభవాన్ని మళ్లీ సాధించాలంటే...ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది హస్తం పార్టీ. అందుకే...ఈ యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.