Vitamin D : నేటికాలంలో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో అందరూ ఆహారంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీని పెంచే పోషకాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. రోగనిరోధకశక్తి పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో అధిక పోషకాలున్న పదార్థాలు, ఔషదాలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి విటమిన్ D. ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యమైంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. విటమిన్ D అధికమోతాదులో తీసుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిపుణులు సప్లిమెంట్స్ తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. 


యూకేలోని సర్రీలో నివాసం ఉంటున్న డేవిడ్ మిచెనర్ అనే 89 ఏళ్ల వ్యక్తి... విటమిన్ D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. డేవిడ్ రక్త నమూనాలను పరీక్షించగా అతను అధికమోతాదులో విటమిన్ D సప్లిమెంట్స్ తీసుకున్నట్లు తేలింది. వైద్య పరీక్షల్లో విటమిన్ D మొతాదు 380 వరకు ఉన్నట్లు తేలింది. అతడు సుమారు 9 నెలలుగా విటమిన్ D సప్లిమెంట్లు తీసుకుంటున్నారు.


విటమిన్ D అధిక మోతాదు వల్ల  హైపర్‌కాల్కేమియాకు గురయ్యాడని.. గుండె, కిడ్నీ ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు. మిచెనర్ మరణం వెనుక మరో కారణం.. సప్లిమెంట్ ప్యాకేజ్‌పై హెచ్చరికలు లేకపోవడమేనని నివేదిక వెల్లడించింది. దానిపై ఎంత మోతాదు తీసుకోవాలనే వివరాలు కూడా లేవని అధికారులు తెలిపారు. విటమిన్ D  అధికంగా తీసుకున్నప్పుడు చాలా తీవ్రమైన ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడవచ్చని నివేదికలో వెల్లడించారు.


విటమిన్ D ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం పేరుకుపోతుందని, అది విషపూరితంగా మారుతుందని నిపుణులు తెలిపారు. శరీరంలో కాల్షియం పెరిగితే వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బాధితుడు మిచెనర్ కూడా ఇలాంటి లక్షణాలతోనే ఆసుపత్రిలో చేరాడు. రక్త నమూనాలను సేకరించిన వైద్యులు మిచెనర్ శరీరంలో విటమిన్ D... ఉండాల్సిన పరిమాణం కంటే అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంతో మిచెనర్ చికిత్స పొందుతూ మరణించాడని నిర్ధరించారు. 


చాలా మంది వయస్సు పైబడిన వారు విటమి డి తీసుకుంటారు. కానీ వారు తీసుకునే సప్లిమెంట్స్ ఏ మోతాదులో తీసుకోవాలన్న అవగాహన తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని అధిక మోతాదులో తీసుకుంటే విషంగా మారుతుందని మిచెనర్ మరణాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి.. డాక్టర్ సలహా తీసుకోకుండా ఎటువంటి ఔషదాలు ఉపయోగించకూడదు.


Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్​ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి






గమనిక : పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






Also Read: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు