భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళల్లోనే ఎక్కువ మంది సమయం గడిపేస్తున్నారు. అయితే దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని అందుకే కనీసం 10 నిమిషాలు అయిన శరీరానికి ఎండ తగిలేలా ఉండమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఆరుబయట నిలబడి కాఫీ లేదా టీ, న్యూస్ పేపర్ చదవడం, వాకింగ్ చేయడం వంటివి చేస్తే మంచిదని అంటున్నారు.


ఏ సమయంలో ‘విటమిన్ డి’ పొందాలి?


సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు ధృడంగా ఉండేందుకు అవసరమైన రోజువారీ విటమిన్ డి కేవలం 10 నిమిషాల పాటు ఉదయం వేళ ఎండలో ఉంటే పొందవచ్చు. అలా అని మరీ ఎండ మండిపోయి చర్మం దెబ్బతినేలా కాదు. శీతాకాలంలో సూర్యరశ్మి పొందటం కష్టమే. కానీ కనీసం సాయంత్రం వేళ అప్పుడు అయినా కాసేపు ఎండలో ఉంటే మంచిది. లేదంటే వైద్యుని సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవచ్చు. సూర్యకిరణాలు చర్మాన్ని తాకినప్పుడు అవి కణజాలం లోపలకి వెళ్ళి సక్రియమవుతాయి. దాని వల్ల విటమిన్ డి తయారవుతుంది. ఉదయం పూట ఎండలో ఉంటే చర్మం మరింత విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ముదురు రంగు చర్మం ఉన్న వాళ్ళ కంటే లేత రంగు చర్మం వాళ్ళు ‘విటమిన్ డి’ని త్వరగా పొందగలుగుతారు.


‘విటమిన్ డి’ వల్ల ప్రయోజనాలు


విటమిన్ డి శరీరానికి కాల్షియాన్ని గ్రహించి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, డిప్రెషన్ ని వారించడంలో సహాయపడుతుంది. గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రోక్, ఉబకాయాన్ని నివారిస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్లు క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తుల్లో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.


‘విటమిన్ డి’ లభించే ఆహారాలు


విటమిన్ డి లోపం నుంచి బయట పడాలంటే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు ఉన్న సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. గుడ్డులోని పచ్చసొన తిన్నా మంచిదే. శాఖాహారులు అయితే పుట్టగొడుగులు తినొచ్చు. లేదంటే పాలు, తృణధాన్యాలు, కాడ్ లివర్ ఆయిల్స్ వంటి బలవర్థకమైన ఆహారాలు తీసుకోవాలి.


ఎంత అవసరం?


పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. అదే 70 సంవత్సరాలు వయస్సు వరకు ఉన్న పెద్దలు 800 IU లేదా 20 మైక్రోగ్రాములు తీసుకోవాలి. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు