ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా ఎక్కువ మంది ఫాలో అయ్యేది సోషల్ మీడియానే. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం వల్ల ప్రతిదీ సోషల్ మీడియాలో చూసి ఫాలో అయిపోతున్నారు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇంటర్నెట్ లోనే మార్గాలు వెతుక్కుంటున్నారు. అయితే అవి కొంతమందికి ఉపయోగంగా ఉన్న మరికొంతమందికి మాత్రం తీవ్ర హాని కలిగిస్తాయి. ఎందుకంటే ప్రతీ ఒక్కరి శరీర విధానం ఒక్కోలా ఉంటుంది. వైద్యులు, పోషకాహార నిపుణులు, డైటీషియన్లు సలహా లేకుండా బరువు తగ్గడం కోసం డైట్ ఫాలో అయితే చిక్కుల్లో పడతారు. అందుకే ఏది నిజం, ఏది అపోహ అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి.


అపోహ: తక్కువ కార్బ్ ఆహారాన్ని అనుసరించడం


వాస్తవం: నిజానికి చాలా మంది తక్కువ కార్బ్ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలో అవుతున్న డైట్ కీటో. ఇది కూడ సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చింది. అయితే తక్కువ కార్బ్ ఆహారాలు తినడం అనేది అందరికీ సరిపోదు. కొంతమందికి తక్కువ కార్బ్ ఆహారం దీర్ఘకాలంలో శరీరానికి శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు, మాంసం, పండ్లు, కూరగాయలు వంటి అన్ని ఆహార సమూహాలతో కూడిన ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తారు.


అపోహ: డైట్ లో ఉన్నప్పుడు శక్తి కోసం కెఫీన్ తాగాలి


వాస్తవం: బరువు తగ్గాలని అనుకున్నపుడు ఎక్కువ మంది చేసే పని కొన్ని ఆహారాలు తీసుకోకూడదని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. అంతే కాదు డైట్ ఫాలో అవుతున్నప్పుడు శక్తి కోసం కాఫీ తాగమని సలహా ఇస్తారు. కాఫీ అనేది మెదడుకి మరింత చురుకుదనం కలిగించే ఒక పానీయం మాత్రమే. ఇది శరీరానికి ఎటువంటి పోషణ, శక్తి అందించదు. పైగా అతిగా కెఫీన్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇతర అనారోగ్య సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. కెఫీన్ తీసుకోవడం వ్యసనంగా మారిపోతుంది. దీని వల్ల నిద్రలేమి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.


అపోహ: క్లెన్సింగ్, డిటాక్స్ డైట్ ఉత్తమం


వాస్తవం: డిటాక్స్ వల్ల కాసేపు రీఫ్రెష్ గా ఉంటారు కానీ శరీరంలోని ద్రవాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల డీహైడ్రేట్ కి గురి కావడం, మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీవక్రియ, కార్డియో వాస్కులర్ సమస్యలను క్లెన్సింగ్ లేదా డిటాక్స్ డైట్ పాటించడం వల్ల తగ్గించగలదని ఎటువంటి ఆధారాలు లేవు.


అపోహ: సప్లిమెంట్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి


వాస్తవం: కొన్ని మందుల కంపెనీలు తమ మార్కెట్ ను పెంచుకోవడం కోసం అలా చెప్తారు కానీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనేది పూర్తిగా అవాస్తవం అని నిపుణులు అంటున్నారు. సప్లిమెంట్స్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుందనేది చాలా అరుదుగా జరుగుతుంది.


అందుకే బరువు తగ్గాలని అనుకున్నప్పుడు చేయాల్సిన మొదటి పని వైద్యులను కలిసి సరైన డైట్ ఫాలో అవడం. సమతుల ఆహారం తీసుకుంటే తగినంత శారీరక శ్రమ కూడా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే అనుకున్న విధంగా బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.


Also Read: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.