TS New Secretariat: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో సచివాలయం ప్రధాన గుమ్మం దగ్గర దట్టంగా పొగలు అలముకున్నాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డీజే నేరుగా రంగంలోకి దిగారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


ఈ ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ స్పందించారు. నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరం అని చెప్పారు. ఆదరా, బాదరా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్నారు. పైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.