Union Budget : 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం బుధవారం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేదని ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో ఇదే విమర్శలతో ఫ్లెక్సీలు , హోర్డింగ్‌లు వెలిశాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది సున్నా అంటూ హైదరాబాద్ లో ఇంగ్లీష్ హోర్డింగ్స్ పెట్టారు. రోడ్డుకు ఓ వైపు పెద్దగా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్స్‌ను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ హోర్డింగ్స్‌పై ఎలాంటి పేరు కానీ, ఎవరు ఏర్పాటు చేశారనే విషయాలు ప్రస్తావించలేదు. ఇవి ఎవరు ఏర్పాటు చేశారో క్లారిటీ లేదు.
కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల కోసమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినట్లు ఉందన్నారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారన్నారు. మన దేశంలోనూ కూడా ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్ వన్ స్థాయిలో ఉంటామన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఆ హామీలు నెరవేర్చేందుకు 2023-24 బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు కేటాయించలేదన్నారు.
తెలంగాణ ప్రయోజనాలు గాలికి
ఇతర రాష్ట్రాలకు అనేక విద్య, వైద్య విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేశారన్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, మెడికల్ కాలేజీ, ఎన్‌ఐడీ విద్యాసంస్థలను తెలంగాణకు మంజూరు చేసేందుకు బీజేపీ సర్కార్‌కు చేతులు రాలేదని విమర్శించారు. బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 89 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లకు తగ్గించడం సరికాదని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఉపాధి కూలీలకు పనిదినాలు పెంచకుండా, నిధులు తగ్గించడం కూలీల పొట్టకొట్టడమే అన్నారు.
కొన్ని రాష్ట్రాల బడ్జెట్ - ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సబ్ కా సాత్ సబ్ కా వికాన్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను ఎందుకు రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు కవిత. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణలోని నిమ్స్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని జాతీయ మీడియా తో మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కేవలం కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తుంది. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు.