Bullet Train Project:


రైల్వే మంత్రి ప్రకటన..


రైల్వే రంగానికి మోదీ సర్కార్ ఎంత ప్రియార్టీ ఇస్తోందో...బడ్జెట్‌ని చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది. ఇప్పటికే వందేభారత్ ట్రైన్‌లనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరోలనే వందే భారత్ మెట్రో రైళ్లనూ తీసుకురానుంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ "బులెట్ ట్రైన్" ప్రాజెక్ట్‌ కూడా పట్టాలెక్కనుంది. ABP Newsతో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు. 2026 ఆగస్టు నాటికి బులెట్ ట్రైన్ భారత్‌లో అందుబాటులోకి వస్తుందని తేల్చి చెప్పారు. స్వయంగా ప్రధాని ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. జపాన్ ప్రభుత్వ సహకారంతో...2026 నాటికి బులెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు వివరించారు. నిజానికి గతేడాది ఆగస్టు నాటికే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాల్సి ఉంది. 2017లో సెప్టెంబర్ 14వ తేదీన జపాన్ ప్రధాని షింజో అబే, ప్రధాని నరేంద్ర మోదీ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. తొలి విడతగా...ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు సర్వీస్‌లు నడపాలని నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి అంటే...2022 ఆగస్టుకి తొలి బులెట్ ట్రైన్‌ అందుబాటులోకి వస్తుందని అప్పుడే హామీ ఇచ్చారు మోదీ. కానీ...ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు రైల్వే మంత్రి ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే...బులెట్ ట్రైన్ రావడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశముందని...ఆయన ప్రకటనతో స్పష్టమైంది. ఈ డిలే కారణంగా...ప్రాజెక్ట్ వ్యయమూ పెరిగే అవకాశ ముంది. 


పెరగనున్న ప్రాజెక్ట్ వ్యయం..


2015 డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. జపాన్‌ ప్రభుత్వం టెక్నికల్‌గా, ఫినాన్షియల్‌గా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.1.08 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే...ఇప్పుడు ఈ ఖర్చు పెరగనుంది. జపాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం...ఆ దేశం భారత్‌కు మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 81% మేర రుణంగా అందిస్తుంది. ఇందుకు భారత్‌ 0.1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. "ప్రాజెక్ట్ వ్యయం, రుణ మొత్తంలో అవసరాలకు తగ్గట్టుగా ఎప్పుడైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు" అని అప్పుడే ఒప్పందంలో చాలా క్లియర్‌గా రాసుకున్నారు. 50 ఏళ్లలో ఈ మొత్తం లోన్‌ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తే...ఇప్పటి ఖర్చులకు అనుగుణంగా వ్యయం కచ్చితంగా పెరుగుతుంది. గతేడాది పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 1396 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 1248 హెక్టార్ల భూమిని సేకరించినట్టు చెప్పారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకూ మొత్తం 508 కిలోమీటర్లను కవర్ చేసేలా తొలి బులెట్ ట్రైన్‌ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే కొంత మేర సివిల్‌ వర్క్స్ మొదలయ్యాయి. మొత్తం 12 స్టేషన్‌లు కవర్ అవుతాయి. 360 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకుపోతుంది. ఆపరేటింగ్ స్పీడ్‌ 320కిలోమీటర్లుగా ఉంటుంది. ముంబయి నుంచి సబర్మతికి కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. 


Also Read: Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన