Vande Bharat Metro:
వందే మెట్రో..
కేంద్ర పద్దులో రైల్వే రంగానికి భారీ కేటాయింపులు దక్కాయి. రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే వందేభారత్ మెట్రో సర్వీస్‌లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా వందేభారత్ మెట్రో సర్వీస్‌లు నడిపేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది మోదీ ప్రభుత్వం. కేంద్ర పద్దుని ప్రవేశపెట్టిన తరవాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వందేభారత్ మెట్రో రైళ్లు "మినీ వర్షన్" అని వెల్లడించారు. త్వరలోనే రైల్వేశాఖ వీటిని తయారు చేస్తుందని స్పష్టం చేశారు.
నగరాల్లోని ప్రజలకు ఈ సర్వీస్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అయితే..దీనిపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావన రాకపోయినా...రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాత్రం ప్రకటన చేశారు.
"ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వందే మెట్రో ట్రైన్‌లు తీసుకురానున్నాం. సిటీల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుతాయి. పూర్తిగా భారత్‌లోనే వీటిని తయారు చేస్తారు. త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. హోం టౌన్స్ నుంచి సిటీలకు వచ్చే వారికి ఈ సేవలు చాలా ఊరటనిస్తాయి. ఈ ఏడాదే డిజైన్‌ను పూర్తి చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వాటి ప్రొడక్షన్‌ను పెంచుతాం"
అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి
సెమీ స్పీడ్ ట్రైన్స్..
కేంద్రం ఇప్పటికే సెమీ స్లీపర్,సెమీ స్పీడ్ వందేభారత్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఇందులో మొత్తం 8 కోచ్‌లు ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తొలి హైడ్రోజన్ ట్రైన్‌నూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు రైల్వే మంత్రి వెల్లడించారు. పూర్తిగా దేశీయంగా తయారయ్యే ఈ రైళ్లను...కల్కా-షిమ్లా ప్రాంతంలో మొదట అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తరవాత క్రమంగా ఇతర నగరాలకూ విస్తరించనున్నారు. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రైల్వేకు రూ. లక్ష 40 వేల కోట్ల నిధులు కేటాయించారు. అప్పుడే నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లలో భారత్ 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తుందని ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కనుక అందరూ ఆసక్తి కనబరిచారు. రైల్వే రంగానికి సంబంధించి లక్ష్యానికి అనుగుణంగా భారీ కేటాయింపులు చేసింది మోడీ సర్కార్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) స్లీపర్ వెర్షన్ కోసం రైల్వే బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల కేటాయింపులకు ఆమోదించారు. వచ్చే రెండేళ్లలో, దేశంలోని వివిధ మార్గాల్లో ఈ వెర్షన్‌కు చెందిన 400 రైళ్లను పట్టాల పైకి తీసుకురానున్నారు. ఈ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్‌తోపాటు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 400 రైళ్లలో, మొదటి 200 చైర్ కార్ రైళ్లు, మిగిలినవి స్లీపర్ వెర్షన్.