MLC Padi Kaushik Reddy: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున హుజారాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని తానే అని ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం రోజు ఈ విషయం స్పష్టం చేశారన్నారు. కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ దిల్లీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే తాము సహించేది లేదని అన్నారు. మహిళలు అంటే తనకు చాలా గౌరవం అని... అయితే గవర్నర్ తీరు వల్లే ఇలా స్పందించాల్సి వస్తోందని చెప్పారు. శాసన సభలో ఆమోదం పొందిన రాష్ట్ర అభివృద్ధి బిల్లులను ఆపడంతో కడుపు మండి మాత్రమే విమర్శలు చేశానని వివరించారు. తన భాషను విమర్శిస్తున్న బీజేపీ నాయకులు.. ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడే భాషపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 



కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలో మంత్రి ప్రారంభింపజేస్తామని... ఇందుకు ఈటలను గౌరవంగా ఆహ్వానిస్తామన్నారు.