Mlc Kaushik Reddy : బీజేపీపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ కు ఎలా సున్నం పెట్టారో,  ఆయనను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు అలానే సున్నం పెట్టారని విమర్శించారు. గవర్నర్ ను చిన్న మాట అంటే గల్లీ నుంచి దిల్లీ దాకా ఉలిక్కిపడ్డారని, సీఎం పదవీ రాజ్యాంగ బద్ధమైన పోస్ట్ కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పై మాట్లాడితే తప్పు లేదు, మేము మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను పట్టుకొని బీజేపీ నేతలు విమర్శించే పద్ధతి ఇదేనా? అని మండిపడ్డారు. మీరు మాట్లాడితే సంసారం...మేము మాట్లాడితే వ్యభిచారమా? అంటూ ప్రశ్నించారు. గవర్నర్ తెలంగాణ అభివృద్ధి అడ్డుకుంటున్నారన్నారు.  


 దిల్లీ డైరెక్షన్ లో నడిస్తే సహించం 


"తెలంగాణలో ఉన్న గవర్నర్ ... గవర్నర్ గా ఉంటే మాకు అభ్యంతరం లేదు. దిల్లీ డైరెక్షన్ గవర్నర్ నడిస్తే మాత్రం సహించం. బీజేపీ ఎమ్మెల్యే తండ్రి చనిపోతే పరామర్శిస్తారు. మా మంత్రులను ఎందుకు పరామర్శించలేదు. అసెంబ్లీ లో పాస్ చేసిన బిల్లులను ఆపితే కడుపు మండుతుంది. మాకు మహిళలంటే చాలా గౌరవం. నేను అన్న భాషలో తప్పులేదు. తెలంగాణ యాస ఆది. దాన్ని పట్టుకొని రాజకీయం చేయాలని చూశారు. కౌశిక్ రెడ్డి భయపడడు. కేసీఆర్ శిష్యుడిని. గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయంగా మార్చకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే కార్యాలయాన్ని మంత్రితో ఓపెన్ చేస్తాం. ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తాం. నేనే బీఆర్ఎస్ అభ్యర్థిని కేటీఆర్ కూడా స్పష్టం చేశారు." - కౌశిక్ రెడ్డి 


ఈటల ఓటమే లక్ష్యంగా 


ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఉపఎన్నికల్లో ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటలను ఓడించాలని లక్ష్యంగా బీఆర్ఎస్ పెట్టుకుంది. ఈసారి బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్.. అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని పరోక్షంగా ప్రకటించారు.  వచ్చే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్‌లో ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. 


ముఖ్యమంత్రికే సవాల్ 
 
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం  బీఆర్ఎస్‌కి కంచుకోట. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏదైనా ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్‌కే పట్టం‌ కట్టారు. అయితే నియోజకవర్గాన్ని బీఆర్ఎస్‌లో ఉండి కంచుకోటగా మార్చుకుంది ఈటల రాజేందర్. ఆయన బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేయడంతో బీఆర్ఎస్ కంచుకోట కాస్తా ఈటల రాజేందర్ కంచుకోటగా మారింది.  ఎమ్మెల్యేగా గెలుపొంది నేరుగా ముఖ్యమంత్రికే సవాల్‌ విసురుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అభ్యర్థిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తాజాగా కౌశిక్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తానే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ప్రకటించుకున్నారు.