Hardik Pandya: న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హార్దిక్ సేన కివీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ తో పాటు సిరీస్ ను చేజిక్కించుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (126), రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్య (30) రాణించటంతో భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి  కుప్పకూలింది. 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 168 పరుగుల తేడాతో గెలుపొందింది. 


ఈ టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. 3 మ్యాచుల్లో 66 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు. కివీస్ తో సిరీస్ విజయం తర్వాత భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. ఈ సందర్భంగా పాండ్య కెప్టెన్ గా తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. అలాగే తన ప్రదర్శన గురించి మాట్లాడాడు. 'నిజం చెప్పాలంటే నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు క్రెడిట్ సహాయ సిబ్బందికి దక్కుతుంది. నేను పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో ఏది అవసరమో అది చేస్తాను. ఎక్కువగా నాపై నేను నమ్మకంతో ఉంటాను' అని పాండ్య అన్నాడు. 


నిర్ణయాలు నేనే తీసుకుంటాను


'నా జీవితం, ఇంకా కెప్టెన్సీ గురించి నాకు  ఒక సాధారణ నియమం ఉంది. నేను నా నిర్ణయాలు సొంతంగా తీసుకుంటాను. ఓటమి పాలైనా దానికి నేనే బాధ్యత వహిస్తాను. నేను బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతాను. ఐపీఎల్ 2022 ఫైనల్ ద్వారా ఒత్తిడిలో ఆడడం అలవాటు చేసుకున్నాను. అలాగే దాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చేయగలమని ఆశిస్తున్నాను' అని హార్దిక్ పాండ్య స్పష్టంచేశాడు.


గిల్ అరుదైన రికార్డ్ 


భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మరియు చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు 168 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 200గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో శుభ్‌మన్ గిల్‌కి ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో భారత్ తరఫున 3 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు.


భారత్ తరఫున ప్రతి ఫార్మాట్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టెస్టు, వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్ గిల్ పేరు నమోదైంది. భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు తరఫున సురేష్ రైనా తొలి సెంచరీ సాధించాడు. దీని తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌లు భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించారు.