Yogi Adityanath Best CM:


సీఓటర్ సర్వే..


దేశంలో 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్..? అని ఓ సర్వే చేపట్టగా...ఇందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తన పని తీరుతో, సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన...ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సీఓటర్, ఇండియా టుడే చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది కంట్రీ పేరుతో చేసిన ఈ సర్వేలో బెస్ట్ సీఎం ఎవరు అని ప్రశ్నించగా...ఎక్కువ మంది యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పారట. సర్వే ప్రకారం మొత్తం 39.1% మంది ప్రజలు బెస్ట్ సీఎం క్యాటగిరీలో "యోగి ఆదిత్య నాథ్‌"కే ఓటు వేశారు. యోగి తరవాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 16% మంది కేజ్రీవాల్‌కు ఓటు వేశారు. ఇక మూడో బెస్ట్ సీఎంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.3% మంది ఓటు వేశారు. యోగి పాపులారిటీ బాగా పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇదే సమయంలో గతేడాది ఆగస్టుతో పోల్చి చూస్తే...కేజ్రీవాల్ పాపులారిటీ 6% మేర తగ్గింది.


గతేడాది ఆగస్టులో కేజ్రీవాల్‌ను బెస్ట్ సీఎంగా 22% మంది తేల్చి చెప్పారు. ఇక మమతా బెనర్జీ పాపులారిటీ కూడా 1% తగ్గింది. మొత్తం 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్ అని లక్షా 40 వేల మందిని సర్వే చేయగా...ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో 2024 ఎన్నికల గురించీ ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వంఅధికారంలోకి వస్తుందని ప్రశ్నించగా...మెజార్టీ ప్రజలు NDA ప్రభుత్వానికే ఓటు వేశారు. బీజేపీకి మొత్తంగా 284 సీట్లు వస్తాయని జోస్యం కూడా చెప్పారు. గతంతో పోల్చితే..కాంగ్రెస్ పనితీరు మెరుగుపడినా ఇంకా పుంజుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు 68 సీట్లు వస్తాయని అంచనా వేశారు. 191 సీట్లుఇతర పార్టీలకు దక్కుతాయని చెప్పారు. ఇక బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అన్న ప్రశ్నకూ ఎక్కువ మంది ప్రధాని నరేంద్ర మోదీ పేరే చెప్పారు. దాదాపు 72% మంది కేంద్ర పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 


మోడీ సర్కార్‌పై సర్వే..


అయితే ఈసారి బీజేపీ విజయం నల్లేరుపై నడక కాదని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఓ సర్వే కూడా ఇదే విషయం చెబుతోంది. C-Voter, India Today సంయుక్తంగా చేపట్టిన సర్వేలోనే..."ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారు" అనే అంశంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మోడీ సర్కార్‌పై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. గత ఆరేళ్లలో మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసే వారి సంఖ్య 50% మేర పెరిగినట్టు ఈ సర్వేలో వెల్లడైంది. 18% మంది  మోడీ పాలనపై అసహనం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఇదే సర్వే 2016లో చేపట్టగా...అప్పట్లో 12% మంది మోడీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నారు. 2020లో కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్న వారి సంఖ్య 9%గా నమోదైంది. ఇప్పుడది 18%కి పెరిగింది.


Also Read: Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా