ఆనం రామనారాయణ రెడ్డికి దమ్ముంటే 2024లో వెంకటగిరి నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆయనకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయన్నారు. ఆయనకు వ్యతిరేకంగా సొంత తమ్ముడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తానని చెబుతున్నారని అన్నారు. వెంకటగిరిలో వైసీపీ నేతలెవరూ ఆనంతో వెళ్లడంలేదని క్లారిటీ ఇచ్చారు.


రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేని పక్కనపెట్టి.. రాజ్యేంగేతర శక్తుల్ని తెరపైకి తెస్తున్నారంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. అప్పట్లో ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్న రామనారాయణ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డిపై పెత్తనం చలాయించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఆయన ప్రవర్తించలేదా అన్నారు. శిలాఫలకాలపై కూడా ఆయన పేరు వేయించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా తనకు పదవి ఉందని, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ గా కేబినెట్ హోదా ఉందని, అందుకే ప్రొటోకాల్ పాటించాలని అధికారులకు చెప్పానన్నారు. అధికారులను బదిలీ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి.. గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకున్నారని. అపోజిషన్ పార్టీలతో టచ్ లో ఉన్నారు కాబ్టటే వారు భయపడుతున్నారని అన్నారు. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందన్నారు. టీడీపీలోకి వెళ్లాలనుకునే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


వెంకటగిరిలో వైసీపీ పటిష్టంగా ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయని, అలాంటి టైమ్ లో ఇన్ చార్జ్ ని నియమించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అపహాస్యం చేస్తున్నారంటూ ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. తన గన్ మెన్లను కూడా తగ్గించారని, తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆయన ఆరోపించారు. అయితే రాజ్యాంగేతర శక్తులు అంటూ నేదురుమల్లిని టార్గెట్ చేసి ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు. అసలు రాజ్యాంగేతర శక్తి ఆనం అని అన్నారు.


వెంకటగిరిలో అందరూ తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకున్నారని. వారి వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు. దురుద్దేశం తోనే వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారని, తాను ఇన్ చార్జ్ గా వచ్చాక, అలాంటి వారందర్నీ సాగనంపుతున్నానని చెప్పారు. దానిపై కూడా రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు రామ్ కుమార్ రెడ్డి.


రామ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు సరే, కానీ ఆనం అసలు వెంకటగిరిలో పోటీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయన నెల్లూరు సిటీ లేదా రూరల్ కి రావాలనుకుంటున్నారు. తన కుమార్తెను ఆత్మకూరు బరిలో నిలపాలని చూస్తున్నారు. ఈ దశలో అసలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో దిగినా.. ఎదురు ఆనం నిలబడతారని అనుకోలేం. అలాంటప్పుడు నేదురుమల్లి సవాళ్లు విసిరినా ఉపయోగం లేనట్టే. 2024లో ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో వేచి చూడాలి.