ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసకువచ్చాయన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్‌ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారి తీశాయన్నారు. విశ్వనాథ్‌ మహాభినిష్క్రమణం తెలుగు సినీరంగానికి గొప్ప లోటని సీఎం అన్నారు. ఆయన సేవలు ఎంతో ఉన్నతమైనవనే వైఎస్సార్‌ పేరుమీద రాష్ట్రప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించిందన్నారు ముఖ్యమంత్రి. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ప్రతి సినిమా ఒక కళాఖండమే: పోచారం


ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి, పద్మశ్రీ , కే విశ్వనాథ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి దేశం గర్వించదగ్గ దర్శకుడు కే. విశ్వనాథ్ అని అభిప్రాయపడ్డారు. విశ్వనాథ్ సినిమాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ విలువలకు ప్రతిబింబం అన్నారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండమంటూ అభివర్ణించారు. కే విశ్వనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పేరు 


తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి బాధాకరమన్నారు తెలంగాణ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తన సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశ్వనాథ్‌ను కోల్పోవడం తెలుగు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్, తెలుగు సినిమాల గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికలపైకి చేర్చారని కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.


కళా తపస్వి విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం


సినీ దిగ్గజం, కళా తపస్వి, ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత, సాహిత్యాలే ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవి అని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్  సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్లిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలుగువారి గొప్పతనాన్ని దశదిశలా చాటింది అన్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య, 10 ఫిల్మ్ ఫేర్, నంది వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వరించాయి అన్నారు. ఆయన మరణం సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమకు, కళా రంగానికి తీరని లోటు అన్నారు. సినిమా ఉన్నంత కాలం ఆయన జనంతో ఉంటారని, ఆయన తీసిన సినిమాలు ఈ సమాజాన్ని ఎప్పటికీ చైతన్య పరుస్తునే ఉంటాయన్నారు. విశ్వనాథ్ శివైక్యం చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.


తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్ట


ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణం పట్ల  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన  మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు.  భారతీయ, తెలుగు సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుత సినిమాలు చేశారని కొనియాడారు.  ఆయన చేసిన సినిమాలు తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని పేర్కొన్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.


మరపురాని చిత్రాలు అందించారు: కవిత


భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ విశ్వనాథ్ మరణం తీరని లోటు అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అర్థరాత్రి ఆయన మరణించారు (K Viswanath No More). 


విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు.