శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. హైడ్రేట్ గా ఉండటానికి నీరు మాత్రమే తాగాలా? అంటే కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. అత్యంత ఆరోగ్యకరమైన పానీయం అంటే అందరూ నీరు అని చెప్తారు. దాహం తీర్చుకునేందుకు అందరూ ఎంచుకునేది నీరు. కానీ ఇది డీహైడ్రేట్ ని తగ్గించడంలో చాలా తక్కువ పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అయినపుడు నీటికి బదులుగా ఒక గ్లాసు పాలు, ఓఆర్ఎస్ లేదా నారింజ రసం ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
నీరుకు బదులు ఇవి మంచిది
హైడ్రేషన్ అంటే నీరు తాగడం కాదు శరీరం నీటిని నిలుపుకోవడం. శరీరంలో ఎక్కువ కాలం ఉండే వివిధ ద్రవాల సామర్థ్యాన్ని హైడ్రేషన్ ఇండెక్స్ కొలుస్తుంది. అందులో దాహం తీర్చడంలో నీరు చాలా తక్కువ పాత్ర పోషిస్తుందని తేలింది. పాలు, ఓఆర్ఎస్, ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఈ ఇండెక్స్లో ఎక్కువ హైడ్రేషన్ కలిగించే వాటిగా ముందున్నాయి. పాలు దాహం తీర్చడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగని నీరు తాగొద్దని ఆయన చెప్పడం లేదు. పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో నీరు కంటే ఏవి బాగా పని చేస్తాయో తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ అంటే కేవలం నీటిని కోల్పోవడం కాదు. ఎలక్ట్రోలైట్ నష్టం కూడా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత, మూత్రం తక్కువగా రావడం, బలహీనత వంటి ఇతర కారణాల వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. కేవలం నీరు తాగడం వల్ల మాత్రమే ఈ నష్టాలను భర్తీ చేయలేం. అందుకే అధిక హైడ్రేషన్ ఇండెక్స్ ఉన్న పానీయాలు డీహైడ్రేషన్ సమయంలో మరింత సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. లిక్విడ్ డ్రింక్స్ మాత్రమే కాకుండా తినే ఆహారాలు కూడా హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడతాయి.
ఈ ఆహారాలు హైడ్రేట్ గా ఉంచుతాయి
పుచ్చకాయలు, టొమాటోలు, నానబెట్టిన బీన్స్, తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకుంటూ కూడా హైడ్రేట్ గా ఉండవచ్చు. నీరు తాగడంతో పోలిస్తే ఒక పండు పూర్తిగా తిన్న కూడా శరీరంలో ద్రవాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. నీరు పూర్తిగా దాహం తీర్చనప్పటికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.
నీరు తాగడం వల్ల లాభాలు
☀ తిన్న ఆహారాన్ని గ్రహించడంలో నీరు సహాయపడుతుంది
☀ రక్తం ఏర్పడటానికి, రక్తం ద్వారా పోషకాలను రవాణా చేయడానికి నీరు సహకరిస్తుంది
☀ రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది
☀ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది
☀ మలం, మూత్ర విసర్జన సరిగా అయ్యేలా చేస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.