గుంటూరు జిల్లా రొంపిచర్లలో టీడీపీ నేత వెన్నా బాలకోటి రెడ్డిపై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఖండించారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి వెన్నా బాలకోటి రెడ్డిపై తుపాకీ కాల్పులు చేయించారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయవద్దని అన్నారు. టీడీపీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరే హత్యాయత్నానికి కారణమని అన్నారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన వెంకటేశ్వరరెడ్డి తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారని అన్నారు. దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేతలకు సవాలు చేశారు. అవసరమైతే తన కాల్ డేటా తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఎవరు ఎవరితో మాట్లాడారో కనిపెట్టాలని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు తాను చెప్పినట్లుగా చెప్పారు.


‘‘కాల్ డేటా తీద్దాం. ఎవరు ఎవరితో మాట్లాడారో తెలిసిపోతుంది. తుపాకీ సరఫరా చేసిన వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తులు అందరిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ కల్చర్ రావటం దురదృష్టకరమని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారందరిని అరెస్టు చేయమని పోలీసులకు చెప్పాను. నేను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధం’’ అని గోపిరెడ్డి స్పష్టం చేశారు.


ఇంట్లో ఉండగానే తుపాకీ కాల్పులు


గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు కాగా, అతణ్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులను గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు అనే వ్యక్తులు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పని చేశారు. పక్కా ప్లాన్ తో రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.


నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు. బలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ సీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించామని టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు చెప్పారు.


కొద్ది రోజుల క్రితమే ఈయనపై హత్యాయత్నం


వెన్నా బాల కోటిరెడ్డిపై కొద్ది నెలల క్రితమే కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఆ సమయంతో త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బాల కోటిరెడ్డి బయటపడ్డాడు. అలవల గ్రామంలోనే ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బాలకోటి రెడ్డిని వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైద్యం అందించారు.