World Brain Tumor Day 2024: ఏటా జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే పాటిస్తారు. బ్రెయిన్ ట్యామర్ గురించి అవగాహన పెంచడానికి, ఆ రోగులకు అండగా నిలవడానికి ఈ డేను నిర్వహిస్తున్నారు. మెదడులో ఏర్పడే కణతులనే.. వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తారు. బ్రెయిన్ క్యాన్సర్ ప్రపంచంలో నాలుగవ అత్యంత తీవ్రమైన, ప్రబలంగా ఉన్న వ్యాధి. 2030 నాటికి ఇది.. చర్మ క్యాన్సర్‌ను అధిగమించి రెండవ అత్యంత ప్రమాదకర క్యాన్సర్‌గా విస్తరిస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు


తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, మాట్లాడేప్పుడు పదాలు తడబడటం, వింతగా ప్రవర్తించడం, శరీరంలో ఏదైనా ఒక భాగం వీక్‌గా అనిపించడం లేదా తిమ్మిరి ఏర్పడటం, పక్షవాతం, సమతుల్యత కోల్పోవడం, వినికిడి లోపం, కంటి చూపు సమస్యలు, గందరగోళం, మెమరీ లాస్ వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. 


చికిత్స:


వైద్యులు నరాల పరీక్ష (కోఆర్డినేషన్, విజన్, ఆడియో/వినికిడి, బ్యాలెన్స్ చెక్), బయాప్సీ, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) పరీక్షల ద్వారా మెదడు కణితులను నిర్ధారిస్తారు. రోగనిర్ధారణ తర్వాత, కణితి నిరపాయమైనదని గుర్తించినట్లయితే, కొన్ని లక్షణాలను బట్టి, న్యూరో సర్జన్లు దానిని పూర్తిగా తొలగిస్తారు. లేదంటే  చికిత్సను అందిస్తు మందులు ఇస్తుంటారు. బ్రెయిన్ ట్యూమర్‌లకు చికిత్స చేయడానికి శస్త్రచికిత్స అనేది సాధారణంగా ఉపయోగించే పద్ధతి. కీమోథెరపీతో రేడియోథెరపీ, స్టెరాయిడ్స్ ,మూర్ఛ నిరోధక మందులు, వెంట్రిక్యులర్ పెరిటోనియల్ షంట్ వీటి ద్వారా చికిత్సను అందిస్తారు.


బ్రెయిన్ ట్యూమర్‌కు సంపూర్ణ పరిష్కారం కనుగొనేందుకు జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ 2000 సంవత్సరంలో World Brain Tumor Dayను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రెయిన్ ట్యూమర్ అడ్వకేసీ గ్రూపులతో ఏర్పడిన ఇంటర్నేషనల్ బ్రెయిన్ ట్యూమర్ అలయన్స్ (IBTA) జూన్ 8ని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా 2010లో ప్రకటించింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. ‘బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్’ అనేది ఈ ఏడాది (2024) థీమ్.


మెదడులో కణితి పెరిగినప్పుడు, అది ఆ భాగంపై ఒత్తిడిని తెస్తుంది. శరీరంలో ఏదైనా ఒక భాగం పూర్తిగా అదుపు తప్పుతుంది. శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది. కణజాలం ఆధారంగా పరిశోధకులు 120 రకాల మెదడు కణితలు (బ్రెయిన్ ట్యూమర్స్)ను కనుగొన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000–50,000 మందికి పైగా బ్రెయిన్ ట్యూమర్‌లతో బాధపడుతున్నారు. వీరిలో 20 శాతం మంది చిన్నారులే. ప్రాణాంతక మెదడు కణితి రోగులందరికీ, సగటు మనుగడ రేటు 34.4 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. 


ప్రాముఖ్యత:


బ్రెయిన్ ట్యూమర్ల రూపాయలు, లక్షణాలు, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ ను దినోత్సవంను నిర్వహిస్తారు. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన క్యాన్సర్ రూపం ఈ బ్రెయిన్ ట్యూమర్. ఇది అత్యంత ప్రమాదకరమైన క్యానర్ రకాల్లో ఒకటి. దీనిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. లేకపోతే.. వ్యాధి ముదిరే వరకు దీన్ని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతారు. లేదా చిత్త వైకల్యం తదితర సమస్యలతో బాధపడతారు.


Read Also : నాన్​ వెజ్​ ఎక్కువగా తింటున్నారా ? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.