Is There a Link to Meat Eating and Liver Health: మానవ శరీరంలో కాలేయం అత్యంత ప్రధానమైన అవయవం. కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.  కాలేయం సరిగా పని చేయకపోతే మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వీలైనంత వరకు మాంసాహారాన్ని దూరం పెట్టడం మంచిదని తాజా పరిశోధనలో వెల్లడైంది. మాంసానికి దూరంగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు తెలిపింది. 


మాంసాహారంతో శరీరంలో అమ్మోనియా పెరుగుదల


అమెరికాలో తాజాగా నిర్వహించిన ఓ క్లినికల్ ట్రయల్ ప్రకారం.. భోజనంలో మాంసాహారాన్ని తీసుకోకపోవడం వల్ల కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారిలో హానికరమైన అమ్మోనియా ఏర్పడటం తగ్గినట్లు తేలింది. మాంసాహారం తగ్గించడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్య  నుంచి కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. నిజానికి అమ్మోనియా అనేది అత్యంత ప్రమాదకరమైన పదార్థం. మాంసాహారం జీర్ణం అయ్యాక ఏర్పడే వ్యర్థ పదార్థమే ఈ అమ్మోనియా. ఇది కాలేయంలోకి వెళ్తుంది. అక్కడ యూరియాగా మారి, మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది.


మాంసాహారం తినడం వల్ల ఎక్కువ మొత్తంలో అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది. ఎంత ఎక్కువ మాంసాహారాన్ని తీసుకుంటే కాలేయం అంత అమ్మోనియాను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మాంసాహారం నుంచి విడుదలైన అమ్మోనియాను ప్రాసెస్ చేయలేక ఒక్కోసారి కాలేయానికి ముప్పు కలుగుతుంది. ఒకవేళ అప్పటికే కాలేయం  దెబ్బతిని ఉంటే మరింత డ్యామేజ్ కలిగిస్తుంది.  కాలేయం అమ్మోనియాను బయటకు పంపించలేకపోతే రక్తంలో అమ్మోనియా స్థాయి పెరిగి హెపాటిక్ ఎన్సెఫలోపతికి కారణం అవుతుంది. అటు కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో పాటు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మెదడు కణజాలం వాపుకు గురై ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.


మాంసాహారం తగ్గిస్తే కాలేయ ఆరోగ్యం


తాజా అధ్యయనం ప్రకారం మాంసాహారాన్ని తగ్గించడం వల్ల కాలేయ వ్యాధి సిర్రోసిస్ నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు తేలింది. రిచ్‌మండ్ వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో సిర్రోసిస్‌తో చికిత్స పొందిన ముప్పై మంది ఔట్ పేషెంట్ల మీద పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిని మూడు గ్రూఫులుగా విభజించి భోజన సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బర్గర్‌ని ఇచ్చారు. మొదటి గ్రూప్ కు  పోర్క్/బీఫ్ బర్గర్లు, రెండవ గ్రూప్‌కు కాస్త శాకాహారం, కాస్త మాంసం ఉండే బర్గర్లు, మూడవ గ్రూప్ కు  శాకాహారం  బర్గర్లు ఇచ్చారు.


మాంసంతో కూడిన బర్గర్లు తిన్న గ్రూపులోని రోగుల బ్లడ్ సీరంలో అమ్మోనియా స్థాయి గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు తమ ఆహారంలో మాంసాన్ని తీసుకోవడం తగ్గించడం వల్ల లివర్ కు మేలు కలిగే అవకాశం ఉన్నట్లు వర్జీనియా కామన్వెల్త్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ జస్మోహన్ బజాజ్ వెల్లడించారు. మాంసాహారానికి బదులు తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు. మాంసాహారాన్ని దూరం పెట్టడం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు కాలేయం, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుదని వెల్లడించారు.


Read Also: నాన్​స్టిక్ పాత్రల్లో వండుతున్నారా? అయితే జాగ్రత్త సంతానోత్పత్తి, థైరాయిడ్ సమస్యలు వస్తాయట