Dietary Guidelines for Indians 2024 : నాన్‌స్టిక్ పాత్రలతో ఎప్పటినుంచో వ్యతిరేకత ఉన్నా.. ఇప్పటికీ వాటిని చాలామంది ఉపయోగిస్తారు. వంట చేసుకోవడానికి నాన్ స్టిక్ చాలా ఈజీగా ఉందని, నూనె తక్కువ అవసరమే ఉంటుందని, క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదని దాదాపు చాలామంది వీటిని వాడుతారు. అయితే నాన్‌స్టిక్ పాత్రల్లో వండుకుంటే తీవ్రమైన ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. అంతేకాకుండా ఇదే అంశంపై మరిన్ని విషయాలు లేవనెత్తింది. అదేంటంటే..
సంతానోత్పత్తి సమస్యలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ICMR కలిసి.. నాన్‌స్టిక్ పాత్రల వినియోగంపై అధ్యయనం చేశారు. ఈ స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ఫలితాలతో నాన్‌స్టిక్ పాన్లలో వంట చేయకూడదని.. ICMR హెచ్చరించింది. ఎందుకంటే దానివల్ల కలిగే దుష్ప్రభావాలు అంత తీవ్రమైన ఆందోళనలు ఇస్తుందని తెలిపింది. నాన్‌స్టిక్ పాత్రల్లో వండుకుని తినడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తవచ్చని ICMR తెలిపింది. అందుకే నాన్‌స్టిక్ పాత్రలకు బదులుగా మట్టిపాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది.
ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి
నాన్‌స్టిక్ కుక్వేర్లలో టెఫ్లాన్ వంటి నాన్ స్టిక్ కోటింగ్‌లు ఉంటాయి. వీటిని వినియోగించే కొద్ది అవి ఆహారంలో కలిసిపోతూ ఉంటాయి. వీటిని అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేసినప్పుడు పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్, పెర్ఫ్లోరోక్టానెసల్ఫోనిక్ యాసిడ్లను విడుదల చేస్తుంది. ఈ రసాయానాలు వంటలోనే కాకుండా.. గాలిలోకి విడుదలై ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, థైరాయిడ్ వంటి రుగ్మతలు, పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశముందని చెప్తోంది.
ఒక్క గీతలో తొమ్మిదివేలకు పైగా మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదల
నాన్‌స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా.. దాని మీద ఉన్న టెఫ్లాన్ వల్ల వాయువులో, వంటలో కొన్ని కెమికల్స్ కలుస్తాయి. ఒక్క గీత నుంచి సుమారు 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతున్నాయని ICMR పేర్కొంది. నాన్స్టిక్ను 170 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. నాన్‌స్టిక్ కడిగేప్పుడు కూడా పాత్రలపై బోలేడు గీతలు పడతాయి. ఇవి లక్షల్లో మైక్రోప్లాస్టిక్స్‌ను విడుదల చేస్తాయని కూడా వెల్లడించింది.
నాన్స్టిక్కు ఇవే ప్రత్యామ్నాయం
అందుకే పర్యావరణ హిత పాత్రల్లో వంట చేసుకోవాలని ICMR సూచించింది. నాన్స్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి, గ్రానైట్ వంటి పాత్రల్లో వండుకుంటే మంచిదని సూచించింది. అయితే వాటిపై ఎలాంటి కెమికల్ పూతలు లేకుండా ఉండాలని తెలిపింది. సిరామిక్ వంటపాత్రలు.. సాంప్రదాయ నాన్‌స్టిక్ పాత్రల మాదిరిగానే ఉంటాయని.. కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఇవన్నీ పర్యావరణానికి హితమైనవి, ఆరోగ్యంపై కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చూపించవని తెలిపింది.
Also Read : సూసైడ్ ఆలోచనలను రెట్టింపు చేస్తున్న గంజాయి.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.