బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమే మరిచిపోతున్నాం. చెప్పాలంటే.. పనుల్లో పడి వాకింగ్, జాగింగ్ మాత్రమే కాదు.. నిద్రపోవడం కూడా మరిచిపోతున్నాం. పనులు లేకపోయినా సరే.. మొబైల్‌కు అతక్కుపోయి మరీ నిద్రను పాడు చేసుకుంటున్నాం. ఒకే చోట కూర్చొని పోయి ఫోన్ చూడటం లేదా.. టీవీ చూస్తూ టైంపాస్ చేసేస్తున్నాం. అయితే, ఇవన్నీ అప్పటికప్పుడు ఆరోగ్యంపై ప్రభావం చూపకపోయినా.. భవిష్యతులో ప్రాణాంతకం కావచ్చు. అందుకే, పరిశోధకులు.. డైలీ ఎంతసేపు కూర్చోవాలి? ఎంత సమయం నిలబడాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి తదితర అంశాలపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో చూసేయండి


2000 మందిపై అధ్యయనం


ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం, 24 గంటల వ్యవధిలో 2,000 కంటే ఎక్కువ మంది ప్రవర్తనను విశ్లేషించి, వారికి కావాల్సిన ఆరోగ్యం కోసం కూర్చోవడం, నిద్రపోవడం, నిలబడడం, శారీరకంగా చురుకుగా ఉండేందుకు అవసరమైన సమయాన్ని నిర్ణయించింది.


ఈ పరిశోధనలో మెరుగైన ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి రోజుకు 24 గంటలలో ఎన్ని గంటలు కూర్చోవడం, నిలబడటం, నిద్రపోవడం, శారీరక శ్రమతో గడపాలో తేల్చి చెప్పారు. వాస్తవానికి, మన జీవనశైలి మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది , మంచి ఆరోగ్యానికి మెరుగైన జీవనశైలి చాలా ముఖ్యం.


ఎన్ని గంటలు నిలబడాలి? కూర్చోవాలి?


న్యూయార్క్ పోస్ట్  నివేదిక ప్రకారం, స్విన్‌బర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సుమారు 2000 మందిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు, దీనిలో మంచి ఆరోగ్యం కోసం, ఒక వ్యక్తి ప్రతిరోజూ 8 గంటలు మంచి నిద్ర పొందాలని కనుగొన్నారు. అలాగే రోజుకు 5 గంటలు నిలబడాలి, 6 గంటలు కూర్చోవాలి. ఇది కాకుండా, ప్రతిరోజూ 4 గంటల పాటు తేలికపాటి, మితమైన శారీరక శ్రమ చేయాలి. 4 గంటల పాటు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాకింగ్ లేదా సైక్లింగ్, జాగింగ్, జంపింగ్, ఏరోబిక్ డ్యాన్స్‌ వంటివి చేస్తుండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఎంత సేపు నిద్రపోవాలి?


పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, తేలికపాటి శారీరక శ్రమ.. అంటే నడవడం నుంచి వంట చేయడం, ఇంటి పనులను పూర్తి చేయడం, అలాగే బిగ్గరగా నవ్వడం వరకు ఏదైనా కావచ్చని తెలిపారు. స్విన్‌బర్న్ బృందం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 8 గంటల 20 నిమిషాలు నిద్రపోవాలని సూచించారు. అంతకంటే తక్కువ లేదా ఎక్కువసేపు నిద్రపోకూడదు. తక్కువ కూర్చోవడం, ఎక్కువ నిలబడటం, శారీరక శ్రమ, నిద్ర మంచి కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.



Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్​లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం