Winter food: చలికాలం వచ్చిందంటే వాతావరణం మారిపోతుంది. చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి శరీరం ఇబ్బంది పడుతోంది. అందుకే శరీరాన్ని కాపాడడం కోసం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నింటిని దూరంగా పెట్టడం అవసరం. అలా దూరంగా పెట్టాల్సిన ఆహారాలేంటో ముందుగా తెలుసుకుందాం. పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ చక్కెర నిండిన ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి మరింతగా బలహీన పడుతుంది. కాబట్టి వీటిని దూరంగా పెట్టాలి. అలాగే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వెంటనే ఆహారాన్ని తినవద్.దు కాసేపు బయట ఉంచి... అది గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక మాత్రమే ఆహారాలను తినాలి. చలికాలంలో చల్లగా ఉండే ఆహారాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.


డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, వేపుళ్ళు వంటి వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇలాంటి కొవ్వు పదార్థాలు చలికాలంలో తినడం హానికరం. చలికాలంలో శరీరం ఆ కొవ్వును కరిగించలేదు. కొవ్వు విపరీతంగా శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల బరువు పెరిగిపోతారు. ఆ బరువును తగ్గించడం కష్టంగా మారుతుంది. కాబట్టి కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.


ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు. చలికాలంలో పాల ఉత్పత్తులను తగ్గించాలి. పెరుగు వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. స్మూతీలు, షేక్స్ వంటివి చల్లగా ఉన్నప్పుడు తాగకూడదు. ఇది శ్లేష్మం ఉత్పత్తిని పెంచేస్తుంది. దీనివల్ల ఊపిరాడటం కష్టంగా మారుతుంది. అలాగే మాంసాహారాన్ని తక్కువగా తినాలి. మితంగా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. మితంగా తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అతిగా తింటే మాత్రం సరిగా అరగక ఇబ్బంది పడతారు. గుడ్లు, పుట్టగొడుగులు, టమోటాలు, నట్స్ వంటివి కూడా మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే అవి శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోయే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం పూర్తిగా తగ్గించాలి. పచ్చి కూరగాయల జోలికి వెళ్ళకూడదు. ఇవి ఎసిడిటీ, ఉబ్బరాన్ని పెంచుతాయి. చలికాలంలో ఏ వ్యాధి అయినా త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటేనే శరీరాన్ని కాపాడుకోగలం. 


Also read: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి


Also read: తలకు నూనె రాసుకోకపోతే వెంట్రుకలకు నష్టమే

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.