Hair Oil: నూనె రాస్తే ముఖం జిడ్డుగా అవుతుందని ఎంతోమంది తలకు నూనెను పెట్టరు. ప్రతిరోజు తలకు స్నానం చేసి వదిలేస్తారు. నిజానికి జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే నూనెను తప్పక రాయాలి. ప్రతిరోజూ రాయడం వీలు కాకపోతే వారానికి కనీసం రెండుసార్లు తలకు నూనెను పట్టించి, ఆ మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచిది. ఆయుర్వేదంలో కూడా తలకు నూనె పట్టించడం చాలా అవసరం అని చెబుతున్నారు. పూర్వం నుండి ఈ ఆచారం అమలులో ఉంది. జుట్టు రాలిపోకుండా, చుండ్రు పట్టకుండా ,కుదుళ్ళు బలహీనంగా మారకుండా కాపాడడంలో నూనె ముందుంటుంది. నూనె తలకు పట్టించి మర్దనా చేయడం ముఖ్యం. దీనివల్ల అక్కడున్న రక్తనాళాలు చురుగ్గా మారుతాయి. వెంట్రుకలకు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల వెంట్రుకలు బలంగా, పొడవుగా పెరుగుతాయి.


కొబ్బరి నూనె కాస్త వేడి చేసి తలపై మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మరింతగా మెరుగుపడుతుంది. తలలోని వెంట్రుకల మూలాల నుంచి బలపడతాయి. దీనివల్ల జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక పిల్లల విషయానికొస్తే ప్రతిరోజూ వారికి నూనె రాయడం చాలా ముఖ్యం. కేవలం ముఖం జిడ్డుగా మారుతుందని నూనె రాయడం మానేస్తే త్వరగా జుట్టు బలహీనపడుతుంది. నూనె రాసిన ప్రతిసారీ ఐదు నిమిషాలు పాటు మాడును మసాజ్ చేయడం మర్చిపోవద్దు. జుట్టు పొడిబారకుండా కాపాడడంలో కూడా ఇది ముందుంటుంది. జుట్టు చిట్లిపోవడం వంటివి కూడా తగ్గుతుంది. పిల్లలకు కచ్చితంగా ప్రతిరోజూ నూనెతో మసాజ్ చేయడం చాలా అవసరం. 


తలకు ఏ నూనె రాయాలి అని ఆలోచించేవారు ఎంతోమంది. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, బాదం నూనె, బృంగరాజ్, ఉసిరి నూనె వంటివన్నీ కూడా జుట్టును కాపాడుతాయి. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాయి. ఏ నూనె రాయాలి అన్నది మీ ఇష్టం. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు నూనెను రాస్తే ఇంకా మంచిది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. నూనెలో కొన్ని కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా అవసరమైనవి. జుట్టుకు మెరుపును అందించడంతోపాటు పొడవుగా పెరిగేలా చేస్తాయి. కాబట్టి వారంలో కనీసం రెండుసార్లు జుట్టుకు నూనెను రాసేందుకు ప్రయత్నించండి. మీ జుట్టు ఆరోగ్యంగా ఎదగడం ఖాయం. జుట్టులోని తేమ బయటికి పోకుండా చూసుకోవాలి. అలా వెంట్రుకలు తేమవంతంగా ఉండాలంటే నూనె రాసుకోవాలి. 




Also read: మీరు ఆల్కహాల్ తాగకపోయినా ఈ అలవాట్లతో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం


Also read: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.