Liver Health: ఆల్కహాల్ తాగే వారికి మాత్రమే కాలేయం దెబ్బతింటుందని అందరూ అనుకుంటారు. కాలేయ సమస్యలు రావడానికి ఆల్కహాల్ ప్రధాన కారణం. ఆల్కహాల్ తాగని వారిలో కూడా కాలేయ సమస్యలు వస్తున్నాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కాలేయం చాలా అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం దెబ్బతింటే ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటారు. మన దేశంలో ప్రతి ఏటా 10 లక్షల మంది కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. ఇందులో లివర్ సిర్రోసిస్ వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నాయి. లివర్ సిర్రోసిస్ వ్యాధి ఆల్కహాల్ తాగే వారిలోనే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఈ లివర్ సిర్రోసిస్ వ్యాధి వస్తుంది.


ఆల్కహాల్ తాగే అలవాటు లేని వారిలో లివర్ సమస్యలు వస్తున్నాయంటే వారి ఆహార నియమాలు సరిగా లేవని అర్థం. అలాగే మధుమేహం ఉన్నవారు, హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నవారు, హెపటైటిస్ సి వంటి సమస్యలతో బాధపడే వారిలో ఈ లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఫ్యాటీ లివర్ సమస్య చివరకు లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. ఈ లివర్ సిర్రోసిస్ సమస్య వస్తే కాలేయం గట్టి పడిపోతుంది. మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కాలేయ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.


ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక శ్రమ లేని వారిలో కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంది. అలాగే కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. వీటి వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి కాలేయం దెబ్బతింటుంది. నలభై ఏళ్ల వయసు దాటిన ప్రతివారు ఏడాదికి ఒకసారి కాలేయం ఎలా పనిచేస్తుందో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్,  థైరాయిడ్, మధుమేహ పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పోషకాహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి తినాలి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన పిండి ధాన్యాలను వాడకూడదు. మైదాకు పూర్తిగా దూరంగా ఉండాలి. తినే ఆహారంలో అవిస గింజలు, వాల్ నట్స్, చేపలు, పొట్టు తీయని పప్పులు అధికంగా ఉండేటట్లు చూసుకోండి. మీరు అధికంగా తాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ టీ రోజుకి రెండుసార్లు తాగితే మంచిది. అలాగే ఆహారంలో పసుపును భాగం చేసుకోండి. ఆపిల్ పండ్లను రోజుకు ఒకటైన తినేటట్టు చూసుకోండి.


Also read: గ్రీన్ పీస్ పలావ్... పచ్చి బఠానీలతో చేసే టేస్టీ పలావ్ ఇది













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.