Green Peas Pulao: పచ్చి బఠానీల సీజన్ వచ్చేసింది. మార్కెట్లో ఎక్కడ చూసినా గ్రీన్ పీస్ విరివిగా దొరుకుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. సీజనల్‌గా దొరికే వీటిని తినడం చాలా ముఖ్యం. వీటితో టేస్టీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి గ్రీన్ పీస్ పలావ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.


కావాల్సిన పదార్థాలు
పచ్చిబఠానీలు - అరకప్పు 
బాస్మతి రైస్ - ఒక కప్పు 
ఉల్లిపాయ - ఒకటి 
జీలకర్ర - ఒక స్పూను 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
లవంగాలు - మూడు 
నూనె - తగినంత 
నీళ్లు - తగినన్ని 
ఉప్పు - రుచికి సరిపడా 
నెయ్యి - మూడు స్పూన్లు 
బిర్యానీ ఆకులు - రెండు
పచ్చిమిరప - రెండు


తయారీ ఇలా
బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో నానబెట్టుకోవాలి. అవి ఇరవై నిమిషాల పాటు నీళ్లలో నానితే చాలు. ఈలోపు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిలో నూనె  వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను నిలువుగా సన్నగా తరుక్కొని వాటిని వేయాలి. పచ్చిమిర్చిని నిలువుగా తరిగి వేసి వేప వేయించాలి. అవి బాగా వేగాక పచ్చి బఠానీలను వేసి వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసి బాగా కలపాలి. రుచికి తగినట్టు ఉప్పును వేసుకోవాలి. పులావ్ ఉడకడానికి అవసరమైన నీటిని వేసి, పైన కాస్త నెయ్యిని వేసి కుక్కర్ మూతను పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి  స్టవ్ కట్టేయాలి. అంతే పులావ్ రెడీ అయినట్టే. 


పచ్చి బఠానీలు సీజనల్‌గా దొరికేవి. కాబట్టి వీటిని కచ్చితంగా తినాలి. చలికాలంలో ఇవి మార్కెట్లో అధికంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్స్, కెరటోనోయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు, అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఇవి తీరుస్తాయి. కూరల్లోనూ, బిర్యానీలోనూ వీటిని కలుపుకొని వండుకోవచ్చు. వీటిలో ఉండే పోషకాలు బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. ఈ బఠానీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బఠానీలకు గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి మధుమేహ రోగులు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. పిల్లలకు పచ్చి బఠానీలతో చేసిన ఆహారాలను తినిపించాలి. ఇది వారికి బలవర్ధకమైన ఆహారంగానే చెప్పుకోవాలి. గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే ఈ పచ్చి బఠానీలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రక్తనాళాలను కాపాడడంలో ఇవి ముందుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తింటే ఎంతో మంచిది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగదు. కాబట్టి టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు వీటిని కచ్చితంగా తినాల్సిందే. కాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తి కూడా వీటికి ఉంది.  గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం వంటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి.