బిగ్ బాస్ సీజన్ 7లో కెప్టెన్ అవ్వడానికి వచ్చిన చివరి అవకాశం కోల్పోయినందుకు అమర్‌దీప్ చాలా బాధలో ఉన్నాడు. దీంతో నాగార్జున వచ్చిన తర్వాత కూడా తనతో అదే విషయాన్ని మాట్లాడారు. అయితే అమర్‌దీప్ కెప్టెన్ అవ్వకపోవడానికి శివాజీనే కారణం కాబట్టి అసలు ఏమైంది అని తనను కూడా అడిగి క్లారిటీగా తెలుసుకున్నారు. నాగార్జునతో మాట్లాడడం పూర్తయిన తర్వాత శివాజీ, అమర్ కూడా కెప్టెన్సీ గురించి మాట్లాడి క్లియర్ చేసుకున్నారు. ఇప్పటినుండి ఇంకొకరిపై ఆధారపడకూడదని అర్థమయ్యిందని అమర్.. నాగ్‌తో అన్నాడు.
అప్పటి అమర్ నిజమా? ఇప్పటి అమర్ నిజమా?
ముందుగా మర్డర్ టాస్క్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసినందుకు, ఆరోగ్యం బాలేకపోయినా బాగా ఆడినందుకు అమర్‌ను ప్రశంసించారు నాగార్జున. ఆ తర్వాత ఇంతకు ముందు నామినేషన్స్‌లో ప్రశాంత్‌పై అమర్‌దీప్ చేసిన ఆరోపణల వీడియోలను నాగ్.. తనకు చూపించారు.
ఈ వీడియోల్లో ప్రశాంత్ ఏడుపును యాక్టింగ్ అని అన్నాడు అమర్. అదే విషయాన్ని నాగార్జున కూడా అడిగారు. ‘‘పరిస్థితులు నా వరకు వస్తే కానీ ఆ బాధ నాకు అర్థం కాలేదు. యాక్టింగ్ చేయాల్సిన అవసరం కూడా నాకు అక్కడ రాలేదు. అక్కడ వరకు వచ్చి కెప్టెన్సీ నాకు దక్కలేదు అనే బాధతో అన్నాను తప్పా యాక్టింగ్ మాత్రం చేయలేదు. దక్కడం లేదనే బాధతో ఏడ్చాను’’ అని అమర్ క్లారిటీ ఇచ్చాడు. అమర్ చెప్పిన సమాధానం విన్న నాగ్.. ‘‘అప్పుడు మేము చూసిన అమర్ నిజమా? ఇప్పుడు మేము చూస్తున్న అమర్ నిజమా?’’ అని అడిగారు. ‘‘నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. నా అనుకున్న మనుషులు నమ్మిన తర్వాత ఏదైనా కోల్పోతే బాధ అలా ఉంటుంది. బయట కూడా ఇలాగే అరుస్తాను. ఇలాగే ప్రవర్తిస్తాను’’ అంటూ తన గురించి చెప్పాడు అమర్.
శివాజీ సీరియస్..
ఎవరిని నమ్మావు అని అడగగా.. శివాజీని నమ్మాను అన్నాడు అమర్. ఆ తర్వాత నాగ్.. శివాజీని ఎందుకు మాట నిలబెట్టుకోలేదని అడగగా.. డిప్యూటీల విషయంలో అమర్ తీసుకున్న నిర్ణయం తనకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే డిప్యూటీల వల్లే తనకు కెప్టెన్సీ ఇవ్వలేదు అని ముందే తెలిసుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాడినని, ఆ మాట తనకు చెప్పలేదని వాపోయాడు అమర్. ‘‘ఆయనకు ఎప్పుడు నిర్ణయం మారుతుందో తెలియదు’’ అని శివాజీని ఉద్దేశించి అన్నాడు. ఆ మాటకు శివాజీ సీరియస్ అయ్యాడు. ‘‘ఎపిసోడ్స్ అన్నీ చూస్తే అర్థమవుతుంది. చాలా గొప్ప నటుడివి’’ అని కోపంగా అన్నాడు. ‘‘నీకంటే కాదు’’ అని అమర్ కూడా కౌంటర్ ఇచ్చాడు.
అమ్మ మీద ఒట్టు..
ఇక కెప్టెన్సీ టాస్క్ సమయంలోనే ఏం జరిగింది అనే విషయాన్ని అమర్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను అర్హుడిని కాదు అన్నారు. అది కరెక్ట్ కాదు. నేను అది తీసుకోలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే.. వెళ్లి అన్నని అడుక్కో అంటే నాకేమైనా ముష్టి వేస్తున్నారా? నేను అడుక్కోవాలా? అక్కడ అర్హులు, అనర్హులు అనేది జరుగుతుందా, అడుక్కోవడం అనేది జరుగుతుందా అని నాకు చాలా బాధ అనిపించింది. ఇంత అడుక్కొని తీసుకోవాలా నేను. మనస్ఫూర్తిగా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను ఎంతో బాధపడ్డాను. అది యాక్టింగ్ కాదు’’ అని అమర్‌దీప్ బాధతో చెప్తుండగా నాగార్జున మధ్యలో జోక్యం చేసుకొని సీరియస్ అయ్యారు. ‘‘ఏంటా మాటలు అమ్మ మీద ఒట్టు అంటూ? అమ్మ మీద ఒట్టు అంటే సెంటిమెంట్ పండుతుంది అనుకుంటున్నావా?’’ అన్నారు. దానికి అమర్ సారీ కూడా చెప్పాడు. ఇక కెప్టెన్సీ అనేది లేదని, కప్ మీద ఫోకస్ చేయమని అమర్‌కు క్లారిటీ ఇచ్చారు నాగార్జున.
Also Read: హౌజ్ నుండి అశ్విని ఔట్, తనతో పాటు మరో లేడీ కంటెస్టెంట్‌పై డబుల్ ఎలిమినేషన్ వేటు!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply