Vikas Raj issues notice to BRS: హైదరాబాద్: నేడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల కమిషన్ మరో షాకిచ్చింది. ఇదివరకే రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ సూచించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా బీఆర్ఎస్ కు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ (Vikas Raj) నోటీసులు జారీ చేశారు. స్కాంగ్రెస్ అని సంబోధిస్తూ ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా, పరిశీలించిన సీఈవో వికాస్ రాజ్ బీఆర్ఎస్ కు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో నోటీసులపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
కర్ణాటక ప్రకటనలు తెలంగాణలో ప్రదర్శన - ఈసీ సీరియస్
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఉంది. కానీ, అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పింది. ఈ తప్పిదంపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు తమకు వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. వెంటనే కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు తెలంగాణలో నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని లేఖలో రాసింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కర్ణాటకకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చాయి. పదే పదే ఫిర్యాదులు వస్తుండడంతో స్పందించిన ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తమ ప్రకటనలను తెలంగాణలో ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వం తమ నుంచి ఏ అనుమతులు పొందలేదని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది.
రైతు బంధు ఆగిపోవడానికి కారణం ఇదే..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి ప్రస్తావించారు. 'మీరు సోమవారం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు నిధులు జమ అయినట్లు మెసేజ్ లు వస్తాయి.' అని అన్నారు. కాగా, సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. కానీ, హరీష్ రావు సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు. ఈసికి పలు ఫిర్యాదులు వెళ్లడం వాటిని పరిశీలించిన ఎన్నికల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను, పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించారని నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 'రైతుబంధు' నిధుల విడుదలకు ఈసీ రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన సమయంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదల అంశాన్ని ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించవద్దనే షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యాఖ్యలు చెయ్యొద్దని పేర్కొంది. 2018 అక్టోబరు 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నిబంధన ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ అనుమతి వెనక్కు తీసుకుంటూ ఆదేశాలిచ్చింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply