Telangana Elections 2023: సింగరేణి కార్మికులకు ఇన్ కం టాక్స్ పూర్తిగా రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారలో భాగంగా బీజేపీ తరఫున మంచిర్యాల నియోజకవర్గంలో అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. .బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒవైసీ పార్టీకి భయపడుతున్నాయని, కానీ బిజెపి పార్టీ ఎవరికీ భయపడదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలు అని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని, జిల్లాలో రఘునాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్ తీసివేసి బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. సింగరేణి కార్మికులకు (Singareni Staff) ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు.
దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం హుజురాబాద్‌లో పర్యటించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ప్రజలు మరోసారి ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మరోసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. పేదలకు న్యాయం జరగాలని అడిగినందుకే సీఎం కేసీఆర్ కక్షగట్టి ఈటలను పార్టీలో లేకుండా చేశాడని ఆరోపించారు. మార్పు రావాలని కోరుకుని, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఈటల తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబానికి చెందిన వారు సీఎం అవుతారని, తమ పార్టీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని అమిత్ షా హామీ ఇచ్చారు.
Also Read: Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కతాటిపై నడిచే పార్టీలు అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి మొత్తం ధాన్యం కేంద్రమే కొంటుందని తెలిపారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.3100 ఇస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తుందని, ప్రజలు ఈ విషయాలు గుర్తించి ఓటు వేయాలన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ నేటి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తెలంగాణకు వచ్చి పలు బహిరంగసభలలో పాల్గొని ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాల రాష్ట్రంగా మార్చారని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply