unemployed youth questions Gandra Venkata Ramana Reddy: వరంగల్: భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియ సరిగ్గా చేపట్టని కారణంగా తనకు ఉద్యోగం రాలేదని ఎమ్మెల్యే అభ్యర్థిని ఓ నిరుద్యోగి నిలదీసింది. ప్రచారంలో భాగంగా భూపాలపల్లి (Bhupalpalle) నియోజకవర్గంలోని రేగొండ మండలం చిన్నకోడెపక గ్రామంలో ప్రచారానికి వచ్చిన గండ్ర వెంకటరమణ రెడ్డి (Gandra Venkata Ramana Reddy)ని గ్రామానికి చెందిన యువత ఉద్యోగాల హామీపై నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రశ్నిచారు.


ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రాదని ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర ఆ యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయని, వాటితో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. బయో టెక్నాలజీ చదివిన ఆ యువతికి మల్టీ నేషనల్ కంపెనీలలో జాబ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నో కొత్త సాఫ్ట్ వేర్ కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పలు కంపెనీలలో 20 లక్షల మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులతో ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నామని చెప్పారు. ఆమె వివరాలు ఇస్తే చదువుకు తగ్గట్లుగా ఫార్మా కంపెనీలో జాబ్ ఇప్పించి సహకారం అందిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 


తనకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిరుద్యోగ యువతి కోరింది. ఆమె అందరికీ ఉద్యోగాల కల్పన గురించి అడుగుతుంటే.. అలా వాదించవద్దని ఎమ్మెల్యే అభ్యర్థి ఆ యువతికి సూచించారు. తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ జాబ్ కోసం చూస్తున్న ఆ యువతి అసహనం వ్యక్తం చేసింది. తాను వచ్చిన వ్యక్తి ఏ పార్టీ నేత, అభ్యర్థి అనేది తనకు సంబంధం లేదని నిరుద్యోగ సమస్య గురించి మాత్రమే తాను లేవనెత్తానని చెప్పింది. కేవలం చదువులు, జాబ్స్ గురించి ప్రశ్నిస్తున్నానని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారని అన్నారు. ఇంటికి దూరంగా ఉంటూ ఎంతో శ్రమించి చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని వాపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డిని యువతి ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


చాలా చోట్ల నిలదీస్తున్న ప్రజలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌కు ఇటీవల ఇదే పరిస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్‌కు వెళ్లిన ఆయనను మహిళలు అడ్డుకున్నారు. కాలనీలోని తమ సమస్యలు తీర్చని వాళ్లు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ నిలదీశారు. మహిళల నిరసనతో కంగుతిన్న అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. 


2018 ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన తరువాత మళ్లీ ఇప్పుడే వచ్చారంటూ ముదొల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలంటూ సాలాపుర్ యువకులు ఆయనను ప్రశ్నించారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మించలేదని, సరైన తాగునీరు కూడా ఇవ్వలేదని గట్టిగా నిలదీయడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. 
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply