CM KCR Slams Congress in Shadnagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాయి ఏదో, రత్నమేదో ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ (Shadnagar), చేవెళ్ల, ఆందోల్ (Andole)లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అభ్యర్థుల చరిత్ర, వ్యక్తిత్వం, చేసిన అభివృద్ధిని చూసి పరిణితితో ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఓటే మీ భవిష్యత్తని, పని చేసే వారినే ఆశీర్వదించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రజల హక్కులు కాపాడడం కోసం పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) కు 11 సార్లు అవకాశం ఇచ్చినా చేసింది ఏమీ లేదని విమర్శించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో పదేళ్లలో అభివృద్ధిని చేసి చూపామని నేడు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


'ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు'


1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. 2004లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పొత్తు పెట్టుకుంటే నాడు, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని, 2005లో తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆ తర్వాత ఉద్యమం చేసి 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అని పోరాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని అన్నారు. 'మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అధికారం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అప్పట్లో ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ లేదు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది.?' అనేది ప్రజలు గమనించాలని చెప్పారు. నేడు తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


'వారికి ఒకే విడతలో దళిత బంధు'


బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే విడతలో చేవెళ్లకు దళితబంధు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు ఆపాలని గత నెలలో ఈసీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 28న రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు అనుమతించిందని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలు మళ్లీ ఫిర్యాదు చేయడంతోనే అనుమతి వెనక్కు తీసుకున్నారని వివరించారు. ఏది ఏమైనా, డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. 'రైతుబంధు నిలిపేస్తే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. రైతులు ఈ విషయాన్ని ఆలోచించాలి. రైతుబంధు కొత్తగా ఇచ్చింది కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఇచ్చాం.' అని పేర్కొన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు ఆగదని పునరుద్ఘాటించారు. షాద్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరిస్తామని చెప్పారు. చేవెళ్లలో 111జీవో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


Also Read: Telangana Elections 2023 : రైతు బంధు ఆగిపోవడం వెనుక ఎవరు ? - బీఆర్ఎస్ , కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు