Telangana Elections 2023 :   తెలంగాణలో ఈసీ అనుమతి ఇచ్చిన రైతు బంధు అనుమతిని రెండు రోజుల్లోనే ఈసీ అనుమతి ఉపసంహరించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కారణం మీరంటే మీరని కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. 


రైతు బంధుకు ఇచ్చిన అనుమతులు నిలిపివేసిన ఉత్తర్వుల్లో ఈసీ ఏం చెప్పిందంటే ?


తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి ప్రస్తావించారు. 'మీరు సోమవారం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు నిధులు జమ అయినట్లు మెసేజ్ లు వస్తాయి.' అని అన్నారు. కాగా, సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. కానీ, హరీష్ రావు సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు. ఈసికి  పలు ఫిర్యాదులు వెళ్లడం వాటిని పరిశీలించిన ఎన్నికల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను, పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించారని నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 'రైతుబంధు' నిధుల విడుదలకు ఈసీ రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన సమయంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదల అంశాన్ని ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించవద్దనే షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యాఖ్యలు చెయ్యొద్దని పేర్కొంది. 2018 అక్టోబరు 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నిబంధన ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ అనుమతి వెనక్కు తీసుకుంటూ ఆదేశాలిచ్చింది.


కాంగ్రెస్ ఫిర్యాదువల్లేనని బీఆర్ఎస్ ఆరోపణలు


అయితే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు వల్లనే ఈసీ రైతుబంధుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు నోటి దగ్గర బుక్కను కాంగ్రెస్ నతలు లాగేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. హరీష్ రావు, కవిత కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎంత కాలం రైతు  బంధును ఆపగలరని ప్రశ్నించారు. తాము మళ్లీ రాగానే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసీకి రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు హైలెట్ చేశాయి. 


 





 


బీఆర్ఎస్ కావాలనే ఆపు చేయిచిందని కాంగ్రెస్ ఆరోపణ


బీఆర్ఎస్ ఆరోపణల్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖడించారు. ఈసీ  ఇచ్చిన ఉత్తర్వుల్లోనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యల కారణంగానే అనుమతి రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారన్నారు. అయినా కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నరని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 


 





 


ప్రజలు ఎవర్ని నమ్ముతారు ?


రైతు బంధు నిధులకు అలా ఈసీ అనుమతి ఇవ్వడం.. వెంటన ే ఉపసంహరించుకోవడంతో  రైతులకు రైతు బంధు నిధులు జమ కావని తేలిపోయింది. తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో.. ఎప్పుడు ఇస్తుందో అని అన్నదాతలు కంగారు పడుతున్నారు.