Union Minster Comments on CAA: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) కచ్చితంగా అమలు చేస్తామని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ (West Bengal)లోని నార్త్ 24 పరగణాలు ఠాకూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఆదివారం మాట్లాడారు. సీఏఏ అమలు కోసం ఇప్పటికే లోక్ సభ, రాజ్యసభ కమిటీలు పని చేస్తున్నాయని, నివేదిక రాగానే దేశవ్యాప్తంగా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. 2024, మార్చి నాటికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తుది ముసాయిదా సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మతపరమైన హింసకు గురై బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన మటువా కులస్థుల పౌరసత్వ హక్కును ఎవరూ లాక్కోలేరని పేర్కొన్నారు.


ఆయన ఏమన్నారంటే.?


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదించినప్పుడు కొన్ని పార్టీలు అరాచకాలు సృష్టించాయి. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాదాపు 220 పిటిషన్లు దాఖలు చేశాయి. అయినా కేంద్రం కచ్చితంగా సీఏఏపై చట్టం చేయబోతోంది. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతాం. బీజేపీ దేశ ప్రజలకు సీఏఏ అమలు చేస్తామని వాగ్ధానం చేసింది. ఈ బిల్లును లోక్ సభలో డిసెంబర్ 9, 2019న ఆమోదించాం. రాజ్యసభలో డిసెంబర్ 11, 2019న ఆమోద ముద్ర పడింది. డిసెంబర్ 12న చట్టంగా మారి, జనవరి 10, 2020న అమల్లోకి వచ్చింది. చట్టం తర్వాత నిబంధనల రూపకల్పనకు లోక్ సభ లెజిస్లేటివ్ కమిటీ వచ్చే ఏడాది, జనవరి 9 వరకు గడువు  విధించింది. రాజ్యసభ లెజిస్లేటివ్ కమిటీ మార్చి 30 వరకూ గడువు విధించింది.' అని వివరించారు.


అయితే, ఈ అజయ్ మిశ్రా వ్యాఖ్యలపై తృణమూల్ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ స్పందించారు. 'బీజేపీకి ఎన్నికల సమయంలోనే మటువాస్, సీఏఏ గుర్తుకు వస్తుంది. పశ్చిమబెంగాల్ లో కాషాయ పార్టీ ఎప్పటికీ సీఏఏ అమలు చేయదు.' అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కాషాయ పార్టీని తిరస్కరిస్తారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ దేశ పౌరులుగా మటువాస్ హక్కులను కల్పించిందని సేన్ అన్నారు.


అసలేంటీ పౌరసత్వ సవరణ చట్టం.?


ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి డిసెంబర్ 31, 2014 అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం అందించడం కోసం కేంద్రం సీఏఏ తీసుకొచ్చింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: వెంటిలేటర్స్ సిద్ధంగా ఉంచుకోండి, చైనా న్యుమోనియా కేసులపై భారత్ మార్గదర్శకాలు