Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో ఎత్తులకు పైఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలతో తమ ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.


రైతు బంధు పథకం, పూర్వాపరాలు..
రైతుబంధు పథకాన్ని 2018 మే 10వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పన ఏడాదికి రెండు వ్యవసాయ సీజన్ లను అనుసరించి ఎకరానికి పది వేల రూపాయలను రైతులకు చెల్లిస్తోంది. రాష్ట్రంలోని 68.99 లక్షల రైతులకు ఈ రైతు బంధు అందుతోంది. ఇప్పటి వరకు 11 విడతలుగా ప్రభుత్వం ఈ రైతు బంధు సాయం అందించింది. 


రైతులే లక్ష్యంగా ఎన్నికల రాజకీయం
గత ఖరీఫ్ సీజన్ లో రైతు బంధును పంపిణీ చేసిన ప్రభుత్వం యాసంగి సీజన్ కు నవంబర్ లో పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రైతు బంధు డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ కారణంతో ఎన్నికల కమిషన్ రైతు బంధు డబ్బులు  రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని ఆదేశించింది. దీంతో రైతులకు రైతు బంధు డబ్బులు అందలేదు.  ఇది కొత్త స్కీం కాదని,  ఆన్ గోయింగ్ స్కీం కనుక  రైతు బంధు డబ్బులు రైతులకు అందేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. 


దీంతో ఈ నెల 24వ తేదీన రైతు బంధు అమలు చేయాలని, కాని ఎన్నికల్లో  లబ్ధి పొందేలా కామెంట్లు చేయవద్దని ఎన్నికల కమిషన్ షరతు విధించింది. అయితే మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో రైతు బంధు నిధులు  వస్తాయంటూ ప్రచారంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను జత చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో , ఆ అంశాన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ తాజాగా రైతు బంధును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీకి ప్రయోజనం కలిగేలా రైతు బంధు పథకాన్ని ప్రచారంలో వాడుకున్నట్లుగా తేల్చింది. దీంతో రైతు బంధను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


రైతుబంధు నిలిపివేత పాపం మీదంటే మీదే అంటున్న పార్టీలు
రైతు బంధు  డబ్బులు రైతులకు చెల్లించకుండా అడ్డుపడింది మీరంటే మీరంటూ అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. కాంగ్రెస్ ఫిర్యాదు వల్లే రైతు బంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సహా ఇతర నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవిత, నిరంజన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ టార్గెట్ గా ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా హస్తం పార్టీ నేతలంతా తామేమి ఫిర్యాదు చేయలేదని, ఎన్నికల కమిషన్ మంత్రి హరీశ్ రావు వాఖ్యలను సుమోటాగా తీసుకుని రైతు బంధు ఆపిందని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఎదురుదాడికి దిగుతున్నారు.


రైతన్న దెబ్బ ఎవరిమీద పడుతుందోనన్న ఆందోళనలో పార్టీలు
రెండు పార్టీలు రైతు బంధు విషయంలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటుంటే.. తమ అకౌంట్లలో డబ్బులు పడతాయని ఆశతో ఉన్న రైతాంగం మాత్రం నిరాశలో కూరుకుపోయారు. డిసెంబర్ 3 తర్వాత ఆగిన రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో జమ చేస్తామని గులాబీ పార్టీ నేతలు, మేం గెలిస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను తమ మాటలతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ వింటున్న రైతాంగం మాత్రం నవంబర్ 30 వే తేదీన పోలింగ్ రోజున ఎవరి దెబ్బకొడతారా అని రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.