ప్రపంచంలో ఆరోగ్యపరిశోధనల్లో ముందున్న సంస్థ హార్వర్డ్ మెడికల్ స్కూల్. వీరి నుంచి ఓ పరిశోధన లేదా, ఓ సలహా వచ్చిందంటే, దాని వెనుక కొన్ని ఏళ్ల అధ్యయనం దాగి ఉంటుందని అర్థం. అందుకే వారు చెప్పే సూచనలకు అంత విలువ. ఇప్పుడు తాజాగా డయాబెటిస్ రాకుండా ఉండేందుకు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. వాటిని పాటిస్తే దీర్ఘకాలం బాధించే షుగర్ వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 


షుగర్ ఎప్పుడు వస్తుంది?
మన శరీరంలో ఉన్న పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను సమర్థ వంతంగా వినియోగించుకోలేనప్పుడు డయాబెటిస్ వచ్చినట్టు నిర్ధరిస్తారు. రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతే ఆ పరిస్థితిని హైపర్ గ్లైసేమియా అంటారు. రక్తంలో పెరుగుతున్న చక్కెరను నియంత్రించలేకపోయినా, తగిన చికిత్స తీసుకోకపోయినా ఆ పరిస్థితి శరీరంలోని ఇతర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే షుగర్ వ్యాధి రాకుండా ముందునుంచే జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. హార్వర్డ్ ఆరోగ్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ఇవే...


1. ఊబకాయం
శరీరబరువుతో చాలా వ్యాధులకు పరోక్ష సంబంధం ఉంది. పెరుగుతున్న బరువు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఊబకాయం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. పొట్ట దగ్గర పట్టిన కొవ్వు విడుదల చేసే కణాల వల్ల ‘ప్రో-ఇన్ఫ్లమేటరీ’ రసాయనాలు విడుదలవతాయి. వీటి వల్ల ఇన్సులిన్ ను ప్రతిస్పందించే కణాల పనితీరులో మార్పులొస్తాయి. తద్వారా ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. అందుకు బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం


2. చురుకుదనం
ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చుని గంటగంటలు గడపవద్దు. శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. కొంతమంది రోజులో కొన్ని గంటల పాటూ కూర్చోవడమో, పడుకుని టీవీ చూడడమో చేస్తుంటారు. ఇలా వ్యాయామం లేని శరీరాలకు త్వరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  కండరాలు పనిచేస్తుంటే శరీరం ఇన్సులిన్, గ్లూకోజ్ ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి బద్దకాన్ని వదిలి శారీరక శ్రమను నమ్ముకుంటే డయాబెటిస్ దరిచేసే అవకాశం తక్కువ.


3. ఆహారం
మంచి ఆహార పద్ధతులు కూడా డయాబెటిస్ ను అడ్డుకుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చక్కెర పానీయాలను తగ్గంచడం మంచిది. చెడు కొలెస్టాల్ ఉన్న పదార్థాలను కూడా దూరం పెట్టాలి. డీప్ ఫ్రై చేసే ఆహారాలను తగ్గించాలి. శుద్ధి చేసిన మాంసాన్ని మానేయాలి. నట్స్, బీన్స్,తృణధాన్యాలు, చేపలు, చికెన్ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. 


4. ధూమపానం, మద్యపానం
ఈ రెండింటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరం పెట్టలేము అనుకున్నవాళ్లు చాలా పరిమితంగా తీసుకోవాలి. ధూమపానం చేయని వారితో పోలిస్తే చేసే వారిలో 50 శాతం అధికంగా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. సిగరెట్ లో ఉండే నికోటిన్ ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది. ఆల్కహాల్ కూడా డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: కోవిడ్ వల్ల మరణించే అవకాశాలు వీరికే ఎక్కువట...


Also read: గొర్రెల కాపరి కనిపెట్టిన కాఫీ.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తోంది


Also read: మీరు కొన్న కారం మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోవచ్చు..