కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ మనదేశంలో కల్లోలాన్ని సృష్టించాయి. థర్డ్ వేవ్ వస్తుందేమోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ ఇంకా ఎక్కడో దగ్గర కోవిడ్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఓ కొత్త అధ్యయనం కోవిడ్ మరణాలు ఎలాంటి వారిలో అధికంగా సంభవించే అవకాశం ఉందో తేల్చి చెప్పింది. ధూమపానం అధికంగా చేసే అలవాటు ఉన్నవారికి కోవిడ్ వచ్చే అవకాశాలతో పాటూ, వారిలో వ్యాధి తీవ్రమై ఆసుపత్రిలో చేరే పరిస్థితులు ఏర్పడతాయని, మిగతా వారితో పోలిస్తే మరణించే అవకాశాలు కూడా ఎక్కువేనని కొత్త అధ్యయనం తేల్చింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి డేటాను పరిశీలించి ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు. ధూమపానం చేయని వారితో పోలిస్తే ఆ అలవాటు ఉన్న వారిలో 80 శాతం మరణాలు ఎక్కువగా నమోదైనట్టు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను ఆన్ లైన్ పత్రిక ‘థొరాక్స్’లో ప్రచురించారు.
ధూమపానం చేసేవారికి కరోనా సంక్రమణ రేటు 45 శాతం అధికమని, అలాగే ఆసుపత్రిలో చేరే అవకాశం 60 శాతం పెరుగుతుందని తెలిపారు పరిశోధకులు. ‘మా అధ్యయనాల్లో ధూమపానం వల్ల కోవిడ్ తీవ్రంగా మారుతుందని తేలింది. స్మోకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు, వివిధ క్యాన్సర్లు మనకు తెలిసిందే. ఇప్పుడు కరోనాతో ధూమపానం ముడిపడి ఉన్నట్టు తెలిసింది’ అని ప్రధాన పరిశోధకుడు ఆష్లే క్లిఫ్ట్ తెలిపారు.
ఈ అధ్యయనం కోసం 4,20,000 మంది కరోనా రోగుల హాస్పిటల్ అడ్మిషన్ డేటా, మరణ ధృవీకరణ పత్రాలను సేకరించింది. అలాగే వారి కరోనా పరీక్ష ఫలితాలను విశదీకరించింది. దాదాపు 14,000 మంది ధూమపానం చేసేవారిలో 51 మంది కోవిడ్ లో ఆసుపత్రి పాలయ్యారు. అంటే 270 మందిలో ఒకరు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ధూమపానం చేయని వారిలో 600 మందిలో ఒకరికి మాత్రమే ఆసుపత్రిలో చేరేంతగా ఆరోగ్యం క్షీణించింది. దీన్ని బట్టి ధూమపానం చేసేవారి కోవిడ్ మరింత తీవ్రంగా ప్రభావం చూపినట్టు నిర్ధారణ అయ్యింది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఆరోగ్యానికి హానికరమేనని మరోసారి రుజువైంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే
Also read: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి